ఇద్దరు ఓపెనర్లు డకౌట్..చరిత్రలో తొలిసారి..
వరల్డ్ టెస్ట్ ఫైనల్లో ఎన్నడూ జరగని సంఘటన చోటు చేసుకుంది. 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా రెండు జట్ల ఓపెనర్లు డకౌట్ అయ్యారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను సౌతాఫ్రికా బౌలర్ కగిసో రబాడ నిప్పులు చెరిగే తన బంతులతో హడలెత్తించాడు. అయిదు వికెట్ల తీసి అదరగొట్టాడు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు మరోవైపు మార్కో యాన్సెన్ మూడు వికెట్లు నేలకూల్చాడు. దీంతో ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 212 పరుగులకే పరిమితమైంది. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన దక్షిణాఫ్రికా బ్యాటర్లను కూడా కంగారూ బౌలర్లు దెబ్బ తీశారు. మిచెల్ స్టార్క్ రెండు, పాట్ కమిన్స్, జోష్ హేజిల్ వుడ్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 43/4 స్కోర్ ఉంది. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, దక్షిణాఫ్రికా ఓపెనర్ ఐదెన్ మార్ క్రమ్ ఇద్దరూ మొదటి ఇన్నింగ్స్ లో డకౌట్లుగా వెనుదిరిగారు. 145 ఏళ్లలో టెస్టు క్రికెట్ లో ఇలా జరగడం ఇదే తొలిసారి. మొత్తంగా రెడ్ బాల్ క్రికెట్లో ఇలా ఇప్పటివరకు 10 సార్లు జరిగింది.