ఢిల్లీ పీఠం ఆమెదే..
ఢిల్లీ సీఎం పదవిపై పది రోజుల నిరీక్షణకు తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళకే ఓటు వేసింది అధిష్టానం. బుధవారం జరిగిన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభా పక్షనేతగా ఓబీసీ నేత రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఆమె ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికవడం గమనార్హం. ఢిల్లీ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీలన్నింటినీ తప్పక నెరవేరుస్తామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. అలాగే మార్చి 8న మహిళా దినోత్సవ కానుకగా ఢిల్లీలోని మహిళలకు ఇచ్చిన ఎన్నికల హామీ నెలకు రూ.2,500 అందజేస్తామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై ఆరోపణలకు కారణమైన శీష్ మహల్‌ను మ్యూజియంగా మారుస్తామని పేర్కొన్నారు. రేఖాగుప్తాను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడంతో, ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మకు నిరాశ ఎదురయ్యింది. అయితే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. పర్వేష్ వర్మ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన సాహిబ్ సింగ్ వర్మ కుమారుడన్న సంగతి తెలిసిందే. నేడు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో రేఖా గుప్తా, పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజనాథ్ సింగ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు ఎన్డీయే నేతలు, ఎంపీలు హాజరుకానున్నారు.


 
							 
							