మహా ముసలం
మహారాష్ట్రలో అసలేం జరుగుతుందో అర్థం కానట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయ్. సొంత పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురేసిన మంత్రి ఎక్‌నాథ్ షిండేపై వేటు వేశారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే. షిండేను… పార్టీ చీఫ్ విప్ పదవి నుంచి సైతం సీఎం ఉద్ధవ్ థాక్రే తొలగించారు. ఐతే తాను ఎవరినీ చీట్ చేయడం లేదంటూ చెప్పుకొచ్చారు ఎక్ నాథ్ షిండే. బాల్ థాక్రే హిందుత్వం బోధించారని… అధికారం కోసం గడ్డి తినడం నేర్పించలేదన్నారాయన. మరోవైపు కూటమిలో లుకలుకలు పెరుగుతున్న సమయంలో… సీఎం ఉద్ధవ్ థాక్రేపై నమ్మకం ప్రకటించారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. పరిస్థితులను ఎలా అదుపులోకి తెచ్చుకోవాలో థాక్రేకు తెలుసునన్నారు. మొత్తం ఎపిసోడ్ శివసేన అంతర్గత వ్యవహారమన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి విపక్షాల సమావేశం కోసం ఢిల్లీ వచ్చిన శరద్ పవార్ సాయంత్రం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను కలవనున్నారు. ప్రస్తుతం 21 మంది ఎమ్మెల్యేలతో గుజరాత్ సూరత్‌లో మెరిడియన్ హోటల్‌లో ఉన్నారు ఎక్ నాథ్. బృందంలో ఐదుగురు మంత్రులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం పరిణామాలపై ఉద్ధవ్ థాక్రే అత్యవసర సమావేశం ఏర్పాటు చేయగా.. ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. సూరత్ హోటల్లో ఉన్న షిండేతో మాట్లాడేందుకు దూతలను గుజరాత్ పంపడం లేదని… ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆయన ముంబై రావాలని శివసేన నేతలు స్పష్టం చేశారు. సంకీర్ణ సర్కారును కూలదోయడానికి బీజేపీ కుట్రలు చేస్తోందంటూ విమర్శించారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్.