దేశాన్ని పాలించడంలో బీజేపీ విఫలం: వైసీపీ ఎంపీ
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశాన్ని సమగ్రంగా పాలించడంలో విఫలమయ్యిందన్నారు వైసీపీ ఎంపీ మార్గాని భరత్. కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణం, ధరల నియంత్రణలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కరోనా కారణంగా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. అయితే భారత్‌లో మాత్రం పేదోడి ఇబ్బందులను తీర్చడానికి కేంద్రం సరియైన చర్యలు తీసుకోలేదన్నారు. దీని కారణంగానే కేంద్రం వంటనూనెల ధరలు నియంత్రించ లేకపోయిందన్నారు. కేంద్ర అసమర్ధత కారణంగానే రూపాయి విలువ రోజురోజుకి పతనం అవుతుందన్నారు. ఈ మేరకు ఇప్పటి వరకు డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 13% పతనమయ్యిందన్నారు. కేంద్రం ఇప్పటికైనా స్పందించి విప్లవాత్మక చర్యలు తీసుకోకపోతే దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టలేదన్నారు. దేశంలో సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాలని చెప్పే కేంద్రం మరి సోలార్ ఎనర్జీపై 18% జీఎస్టీ ఎందుకు వేస్తుందో అర్ధం కావడం లేదన్నారు.
పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తయితే జలవిద్యుత్ కూడా అందుబాటులోకి వచ్చేదని.. కేంద్రం పునరావాస ప్యాకేజి ఇవ్వకపోవడం వల్లే పోలవరం ఆలస్యమవుతుందన్నారు. వంటనూనెలు దిగుమతి కన్నా దేశంలో వంటననూనెల ఉత్పత్తి పెంచడంపై కేంద్రం ఇప్పటికైనా దృష్టి సారిస్తే మంచిదన్నారు. భారత దేశంలో హిందుత్వానికి ఛాంపియన్లు అని చెప్పుకుంటున్న బీజేపీ… దేవాలయాలపై జీఎస్టీ ఎందుకు వసూలు చేస్తుందో స్పష్టం చేయాలన్నారు. దేశంలో చమురు ధరలు ఆకాశానికంటుతున్న నేపథ్యంలో విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఇంధనాలకు ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్రం ఎందుకు అన్వేషించడం లేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటా ఆదాయం 31% శాతానికి పడిపోయిందన్నారు. అంతేకాకుండా కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన 18 వేల కోట్ల రెవిన్యూ లోటును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన అభివృద్ది నిధులు కూడా పెండింగులో ఉన్నాయని.. వాటిని కేంద్రం వెంటనే విడుదల చేయాలని కోరారు. దేశ ప్రజలకు పెనుభారంగా మారిన నిత్యావసరాల ధరలను త్వరలో నియంత్రణలోకి తెచ్చి సామాన్యునికి ఊరట కల్పించాలన్నారు. జీఎస్టీ కౌన్సిల్‌లో కూడా మెజారిటీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉండడం వల్ల వారు తీసుకునే నిర్ణయాలు ఆమోదం పొందుతున్నాయని..దీని వల్ల మిగిలిన రాష్ట్రాల వాదనలు నెగ్గడం లేదని తెలిపారు.