Home Page SliderNational

అమేథీలో పోటీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రాహుల్ గాంధీ!

కాంగ్రెస్ అగ్రనేత యూపీలో పోటీ విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. గత ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన వాయనాడ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తాజాగా ఆయన వాయనాడ్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం సైతం నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో మే 20న జరగనున్న అమేథీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. మొత్తం వ్యవహారంపై సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ సస్పెన్స్‌ కొనసాగించారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తారా అంటూ విలేకరి అడిగిన ప్రశ్నకు రాహుల్ స్ట్రైట్ గా సమాధానం ఇచ్చారు. “ఇది బిజెపి ప్రశ్న, చాలా బాగుంది. నాకు ఏ ఉత్తర్వు వచ్చినా, నేను దానిని అనుసరిస్తాను. మా పార్టీలో, అభ్యర్థుల ఎంపిక నిర్ణయాలన్నీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తీసుకుంటుంది” అని రాహుల్ గాంధీ చెప్పారు. తాను పార్టీకి సైనికుడినని, కమిటీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఒకప్పుడు గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీ 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఇప్పటికే వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ అమేథీ నుంచి కూడా పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. యూపీలో ఎననికల ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇవాళ రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.

గతంలో తన మామ సంజయ్ గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ, ఆ తర్వాత తల్లి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన సీటును తిరిగి గెలవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కూడా అమేథీ ప్రజలు తమకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నారని, సరైన సమయంలో లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. . “నేను వారికి ప్రాతినిధ్యం వహించాలని, వారి ప్రాంతానికి వెళ్లి, వారి సమస్యలు వినాలని, తద్వారా వారు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. నేను కూడా రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో ఉన్నాను, అయితే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడే తొందర లేదు” ఆయన విలేకరులతో అన్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ అమేథీలో విజయం సాధించడంతో, కాంగ్రెస్ అగ్రనేత 15 ఏళ్ల ప్రస్థానం ముగిసింది. ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమికి అనుకూలంగా బలమైన అండర్‌ కరెంట్ ఉందని, బీజేపీ 150 సీట్లకే పరిమితమవుతుందని రాహుల్ గాంధీ ఈరోజు ప్రకటించారు. 15-20 రోజుల క్రితం బీజేపీ దాదాపు 180 సీట్లు గెలుస్తుందని అనుకున్నాం, కానీ ఇప్పుడు వారికి 150 సీట్లే వస్తాయని భావిస్తున్నానన్నారు. ప్రతి రాష్ట్రం నుంచి కూటమికి విజయవకాశాలు మెరుగైనట్టు వార్తలు వస్తున్నాయని చెప్పారు.