న్యాయమూర్తి ఇంట్లో కాలిన నోట్లకట్టలు..సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో కీలక విషయాలు..
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా బయటపడిన నోట్లకట్టల ఆరోపణలపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ..శనివారం 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. ఈ నివేదిక మొత్తాన్ని అనూహ్యంగా సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం కావడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనిలో ఢిల్లీ పోలీస్ కమిషనర్ అందించిన వివరాలు, ఫోటోలు, వీడియోలు ఉన్నాయి.. అంతేకాక అంతర్గత విచారణ ప్రక్రియ వివరాలతో పాటు అగ్నిమాపకశాఖ ఆపరేషన్ వివరాలు, యశ్వంత్ వర్మ వివరణ కూడా ఉన్నాయి. దీనిలో యశ్వంత్ వర్మ తాను కానీ, తన కుటుంబసభ్యులు కానీ ఆ స్టోర్ రూమ్‌లో ఎటువంటి నగదును ఉంచలేదని పేర్కొన్నారు. తనకు సంబంధం లేదని, ఆ సొమ్ము తమకు సంబంధించినది కాదని వెల్లడించారు. దీనిపై సమగ్ర విచారణ అవసరమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు. సీజేఐ సంజీవ్ ఖన్నా దీనికోసం 3 రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. పంజాబ్- హరియాణా, హిమాచర్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జస్టిస్ యశ్వంత్ వర్మకు కేసుల విచారణ పరంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని ఢిల్లీ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి. కె. ఉపాధ్యాయను సీజేఐ ఆదేశించారు.

