శిక్షణతో బీజేపీ సమరోత్సాహం..! మళ్లీ పాదయాత్ర
మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోయినా.. సాధించిన ఓట్లతో బీజేపీ సమరోత్సాహంతో ఉంది. ఈ ఊపుతో వచ్చే ఏడాది డిసెంబరులో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సమాయాత్తమవుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రను త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి ఎన్నికలకు సన్నద్ధం చేసే ప్రణాళికను బీజేపీ అధిష్టానం చేపడుతోంది. టీఆర్‌ఎస్‌కు దీటుగా బీజేపీ కార్యకర్తలను అన్ని విధాలుగా సమాయాత్తం చేసే దిశగా వ్యూహాన్ని రూపొందిస్తోంది. శిక్షణా తరగతులకు బీజేపీ జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్‌లతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు సమన్వయం చేస్తారు.

జాతీయ నాయకుల బోధన..
బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులకు ఈ నెల 20, 21, 23 తేదీల్లో శిక్షణా తరగతులు నిర్వహించాలని పార్టీ అగ్ర నేతలు నిర్ణయించారు. హైదరాబాద్‌లోని అన్నోజిగూడలో నిర్వహించే ఈ శిక్షణా తరగతుల్లో జాతీయ నేతలు శిక్షణ ఇస్తారు. ప్రజాక్షేత్రంలోకి ఎలా వెళ్లాలి..? పార్టీని ఎలా బలోపేతం చేయాలి..? పార్టీ సంస్థాగత నిర్మాణం.. సిద్ధాంతాలు.. సాధించాల్సిన లక్ష్యాలు.. గుర్తుంచుకోవాల్సిన రాజకీయ అంశాలు.. ఇలా ఒక్కో సబ్జెక్టును ఒక్కో జాతీయ నాయకుడు బోధిస్తారు. ప్రతి క్లాసు 40-50 నిమిషాల పాటు ఉంటుంది. శిక్షణా శిబిరానికి వచ్చే రాష్ట్ర నాయకులకు మూడు రోజుల పాటు బస, భోజన ఏర్పాట్లను శిక్షణా శిబిరం ప్రాంగణంలోనే ఏర్పాటు చేస్తారు.