NewsTelangana

కమలంలో కథనోత్సాహం

Share with

అధికారమే లక్ష్యంగా కమలం పార్టీ అడుగులు వేస్తోంది. కాషాయదళం దూకుడు పెంచుతోంది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాలల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. సీనియర్లకు పని విభజన చేయాలని పార్టీ నిర్ణయించింది. ఉత్తర తెలంగాణలో మరింత పట్టుకోసం కమలదళం పావులు కదుపుతోంది. ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాలు బీజేపీ చేతిలో ఉండగా… ఆ ప్రాంతాల్లో పార్టీ పట్టును పెంచుకునేలా అధినాయకత్వం వ్యూహరచన చేస్తోంది. ప్రజాబలం కలిగిన నేతలను పార్టీలో చేర్చుకునేందుకు కసరత్తు ముమ్మరం చేస్తోంది. అదే పనిలో ఈటెల రాజేందర్ నేతృత్వంలోని చేరికల కమిటీ ఇప్పుడు ఉత్తర తెలంగాణపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి కేసీఆర్ చేతిలో మోసపోయిన నేతలను బీజేపీలోకి తీసుకొచ్చి.. భవిష్యత్ పై భరోసా కల్పించాలని పార్టీ యోచిస్తోంది. ఇప్పటికే బీజేపీలో నల్లాల ఓదేలు, ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇదే దారిలో గంప గోవర్ధన్, రాజయ్య యాదవ్, నాగుర్ల వెంకన్న, గుడిమల్ల రవికుమార్ తదితరులున్నట్టు ప్రచారం జరుగుతోంది.