దేశం గర్వపడేలా చేశారు..మీ రాక కోసం ఎదురుచూస్తున్నా..ప్రధానిమోదీ
ఆసియా క్రీడల్లో భారత్ క్రీడాకారులు తొలిసారి నూరు పతకాలు సాధించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత్ అథ్లెట్లు దేశం గర్వపడేలా చేశారని, వారి రాక కోసం ఎదురు చూస్తున్నానని వారికి తప్పక ఆతిథ్యమిస్తానని వెల్లడించారు. ఆసియా క్రీడలు అక్టోబర్ 10న ముగియనున్నాయి. ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత వారి బృందాలకు ఆతిథ్యమిస్తానని స్వయంగా సోషల్ మీడియా ఎక్స్‌లో ప్రకటించారు ప్రధాని మోదీ. ఆసియా క్రీడలలో భారత్ క్రీడాకారులు అద్భుతమైన నైపుణ్యాలు ప్రదర్శించారని, పతకాల సంఖ్య 100కి మించడంతో దేశప్రజలంతా గర్విస్తున్నారని, వారి రాక కోసం ఎదురు చూస్తున్నామని ఆయన పోస్ట్ చేశారు. ఇప్పటి వరకూ భారత్ 25 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్య పతకాలు సాధించి పతకాల పట్టికలో నాలుగవ స్థానంలో నిలిచింది.