బాసర IIIT లో వెలుగు చూస్తున్న నిజాలు..
గత కొంత కాలంగా ఏదో ఓ కొత్త కథనంతో బాసర ట్రిపుల్ ఐటీ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా పీయూసీ 2 విద్యార్ధి సంజయ్ మృతితో క్యాంపస్ అధికారుల వసూళ్ల దందాలు బయటపడ్డాయి. అయితే అధికారులు ఆరోగ్య బీమా అంటూ ప్రతి సంవత్సరం విద్యార్దుల నుండి రూ. 700 వరకు వసూలు చేస్తున్నట్లు విద్యార్దులు తెలిపారు. ప్రీ యూనివర్సిటి కోర్సు 1 విద్యార్దుల నుండి ప్రతి ఏటా ప్రవేశాల సమయంలోనే యాజమాన్యం బీమా డబ్బులు వసూలు చేస్తోందని విద్యార్దులు ఆరోపించారు. ఇదే తరహాలో ట్రిపుల్ ఐటీ యాజమాన్యం గత ఏడాది 1500 మంది విద్యార్దుల నుండి 10 లక్షలకు పైగా వసూలు చేసినట్టు తెలిసింది. కానీ ఆర్‌జీయూకేటీ యాజమాన్యం వసూలు చేసిన ఆ బీమా సొమ్ము ఏ సంస్ధకు చెల్లించకుండా తమ వద్దే ఉంచుకుంటుందని విచారణలో తేలగా , అసలు గత ఏడాది కూడా బీమా డబ్బులు ఏ సంస్ధకు చెల్లించలేదని ఇంచార్జీ వీసీ వెంకటరమణ సెలవిచ్చారు. అదే విధంగా 2018 నుండి విద్యార్దుల ఆరోగ్య బీమా చెల్లింపు విషయంలో పలు అనుమానాలు ఉన్నట్టు తెలిపారు.
ఈ క్రమంలో విద్యార్దుల బీమా డబ్బులు చెల్లించాలని పేరేంట్స్ కమిటీ అధ్యక్షురాలు రాజేశ్వరి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. డబ్బులు వసూలు చేసి వాటిని ఎందుకు కట్టలేదో తేల్చాలంటూ విద్యార్దులు , తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చెల్లించిన బీమా డబ్బులను ఏమి చేశారో చెప్పాలంటూ సంస్ధ అధికారులని ప్రశ్నించారు. బీమా డబ్బులు విద్యాలయంలోనే ఉన్నాయంటూ… దీనిపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఇంచార్జ్ వీసీ వెంకట రమణ హెచ్చరించారు.