ఇకపై క్యాంపస్‌లో..నో మొబైల్ ఫోన్
ఇటీవల కాలంలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు వరుసగా ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే.తమకు క్యాంపస్‌లో సరైన వసతులు కల్పించాలని కొన్నిరోజుల క్రితం విద్యార్ధులు ఆందోళన చేపట్టారు.ఈ నేపథ్యంలో బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు విద్యార్ధులకు కఠిన ఆంక్షలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.దీనిలో భాగంగానే క్యాంపస్‌లో ఇకపై మొబైల్ ఫోన్ల వినియోగాన్ని అనుమతించబోమని బాసర ట్రపుల్ ఐటీ యాజమాన్యం స్పష్టం చేసినట్లు విద్యార్ధులు భావిస్తున్నారు.ఇప్పటి వరకు క్యాంపస్‌లో తలెత్తిన ప్రతి సమస్య బయటికి రావడానికి కారణం ఈ మొబైల్ ఫోన్లేనని అధికారులు భావిస్తున్నారు.
ఎందుకంటే క్యాంపస్‌లోకి రావడానికి మీడీయాకు అనుమతి లేదు గనుక విద్యార్ధులే వాటిని తమ మొబైల్ ఫోన్లు ఉపయోగించి బయటకు తీసుకు వస్తున్నారని ట్రిపుల్ ఐటీ యాజమాన్యం అభిప్రాయ పడుతున్నారు.దీని కారణంగానే యాజమాన్యం విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటుందని, విద్యార్దుల చదువుకు ఎంతో అవసరమైన మొబైల్ ఫోన్లపై ఆంక్షలు విధిస్తున్నారని విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే ట్రిపుల్ ఐటీలో విద్యార్ధులకు జరుగుతున్న అన్యాయాలు బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే యాజమాన్యం ఇటువంటి నిబంధనలు తీసుకువచ్చారని కొందరు విద్యార్ధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి ఆంక్షలు క్యాంపస్‌లో విద్యార్ధులకు మాత్రమే కాకుండా ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేయాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు.