NewsTelangana

కేసీఆర్ కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమేనా..? కోమటిరెడ్డి

Share with

ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాలలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి రాజీనామ హాట్ టాపిక్‌గా మారింది.ఈ రాజీనామాపై ఇన్ని రోజులు ఎన్నో పుకార్లు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో వీటన్నింటికి స్వస్తి పలికే దిశగా కోమటి రెడ్డి తన రాజీనామాకి సంబంధించి తాజాగా ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఎన్నో వందల మంది పోరాట యోధుల ప్రాణత్యాగాలతో..ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రాన్నికేసీఆర్ తన కుటుంబ ఆస్తిగా మార్చుకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన విధించి ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్న కేసీఆర్‌పై త్వరలోనే యుద్దం ప్రకటిస్తానన్నారు. రాష్ట్రప్రజలను  ఎన్నికల ముందు వరకు గాలికి వదిలేసి..ఎన్నికల సమయంలో మాత్రమే పట్టించుకున్నట్లు నమ్మించి సంక్షేమ పథకాలను అమలు చేసే ఉత్తమ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేరుగాంచారన్నారు. ముఖ్యంగా మునుగోడు నియోజక వర్గంపై కక్షగట్టిన కేసీఆర్ మూడున్నర ఏళ్ళుగా నన్ను నా నియోజకవర్గ ప్రజలను అన్ని విధాలుగా వేధిస్తూ..నియోజకవర్గ ప్రజల అభివృద్ధిని ఆపేశారని తెలిపారు.

నా నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించారనే కోపంతో..మా పరిధిలో ఉన్న ఎస్ఎల్‌బీసీ,బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టులు 90% పనులు 2014 కంటే ముందే పూర్తి అయినప్పటికీ వాటిని పక్కనబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.డిండి లిఫ్ట్ ఇరిగేషన్‌లో భాగంగా తమ భూములను కోల్పోయిన కిష్టరాయినిపల్లి వాసులకు మల్లన్న సాగర్ తరహాలో నష్టపరిహారం ఇవ్వాలని కోరగా..వారిపై పోలీసులతో దాడి చేయించి అక్రమంగా కేసులు పెట్టారన్నారు. నా నియోజక వర్గాన్ని కూడా గజ్వెల్,సిరిసిల్ల,సిద్దిపేట లాగా అభివృద్ది చేస్తే నేను రాజీనామా చేస్తానని రెండేళ్ల క్రితమే ప్రకటించానన్నారు. అదే విధంగా మునుగోడులో ఉన్న నా దళిత సోదరులందరికీ దళితబంధు,చేనేత,గౌడ,యాదవ,ముదిరాజ్,మైనారిటీ వంటి వారికి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేస్తే నేను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానని ఏడాది క్రితమే చెప్పానన్నారు. కేసీఆర్ తన కుటుంబ ఆస్తులను పెంచుకుంటూ,రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి రాష్ట్రంలోని అన్ని వర్గాలకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి రాక్షస పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించేంత వరకూ..నేను వెనక్కి తగ్గేదే లేదని పెర్కొన్నారు.

మొదటి నుంచి చెబుతున్న విషయంలో డైలమా,వెనకడుగు వేయడం వంటివి నా రక్తంలోనే లేవన్నారు.అయితే ఇదంతా నా సొంత ప్రయోజనాల కోసమో,పదవుల కోసమో ఈ పోరాటం చేయట్లేదన్నారు. నేను ఇప్పటికే నా సన్నిహితులు,ముఖ్యనాయకులు,ప్రజాప్రతినిధులతో చర్చించి కేసీఆర్ పాలనపై సమర శంఖం పూరించాలని నిర్ణయించుకున్నానన్నారు.ఈ నా నిర్ణయాన్ని మునుగోడు నియోజకవర్గ ప్రజలందరూ..స్వాగతిస్తున్నారని వెల్లడించారు. ఈ మేరకు అతి త్వరలో నేను మొదలుపెట్ట బోయే కురుక్షేత్ర యుద్ధానికి కేసీఆర్ సన్నద్ధమవ్వాలని సూచించారు.అయితే వంధిమాగదులు, వందలకోట్ల సంచులతో యుద్ధానికి వచ్చే కేసీఆర్ ఆయన కౌరవ సేనను ఎదిరించి రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు దిశగా మునుగోడు వేదికగా ముందుకు వెళతామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. దీంతో కోమటిరెడ్డి కాంగ్రెస్‌ను వీడే సూచనలు ఎక్కువగా ఉన్నాయని పసిగట్టిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ఆయనతో భేటి నిర్వహించారు.ప్రస్తుతం ఉత్తమ్ కోమటిరెడ్డిని బుజ్జగిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి కాంగ్రెస్‌ను వీడకుండా..చేసే బాధ్యతను ఏఐసీసీ ఉత్తమ్ కుమార్‌కు అప్పగించినట్లు సమాచారం.