ఏపీ రుణం రూ.11 లక్షల కోట్లు
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి నాలుగేళ్లుగా అస్తవ్యస్తంగా తయారైంది. వ్యవస్థలో అవకతవకలు, నిర్వహణా విధానాలు, కార్పొరేషన్ల రుణాలు, ప్రభుత్వ గ్యారంటీలతో తెచ్చిన రుణాలు, ఇతర గ్యారంటీలతో చేసిన అప్పులపై కేంద్ర ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలి.
అమరావతి: ఏపీ ఆర్థిక పరిస్థితి నాలుగేళ్లుగా అస్తవ్యస్తంగానే ఉంది. వ్యవస్థలో అవకతవకలు, నిర్వహణా విధానాలు, కార్పొరేషన్ల రుణాలు, ప్రభుత్వ గ్యారంటీలతో తెచ్చిన రుణాలు, ఇతర షూరిటీలతో చేసిన అప్పులపై కేంద్ర ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలి. అప్పులు సుమారు రూ.11 లక్షల కోట్లకు చేరాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని డిస్టిలరీలు, ప్రభుత్వ లెక్కల్లోకి రాకుండా మళ్లుతున్న మద్యం ఆదాయంపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి ఆమె ఈ మేరకు లేఖ అందజేశారు. ఈ లేఖను మంగళవారం విడుదల చేశారు. లేఖలోని ముఖ్యాంశాలు.
రాష్ట్ర అప్పులపై ఎంపీలు పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నలకు ఆర్బీఐకి రాష్ట్రం ఇచ్చిన అప్పులు రూ.4.42 లక్షల కోట్లుగా ఉంది. కార్పొరేషన్లతో సహా చేసిన ఇతర అప్పులను వెల్లడించలేదు. రాష్ట్ర అప్పులు రూ.10.77 లక్షల కోట్లని గతంలో బీజేపీ రాష్ట్ర శాఖ వెల్లడించింది. పార్లమెంటు సమాధానాన్ని అడ్డుగా పెట్టుకుని కుటుంబ మీడియా, వాలంటీర్ల సాయంతో బీజేపీ రాష్ట్ర శాఖ ప్రతిష్ఠ దెబ్బతినేలా వైకాపా ప్రచారం చేసింది. ప్రజాక్షేమం కోసం, భవిష్యత్తు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను నివారించేందుకు ప్రయత్నిస్తే వైకాపా తప్పుగా చిత్రీకరించింది. రాష్ట్రంలో గుత్తేదారులు, సరఫరాదారులకు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి నాలుగేళ్లుగా బకాయిలు చెల్లించలేని దుస్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీసుకువచ్చారు. మున్సిపల్, ఆస్తి పన్నులు, విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించకపోతే 18 శాతం అదనంగా వసూలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం సకాలంలో చెల్లించని బకాయిలపై అంతే వడ్డీ ఎందుకు చెల్లించదు అని వర్తక వాణిజ్య సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం రూ.90 వేల కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా రూ.35 వేల కోట్లు, ఇతరేతర ఆదాయం కలిపి మొత్తం రూ.1.35 లక్షల కోట్లు. రాష్ట్ర వ్యయం రూ.2.60 లక్షల కోట్లుగా బడ్జెట్ అంచనా. మిగిలిన లోటు మొత్తం కేంద్ర గ్రాంట్లు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో రిజర్వు బ్యాంకు నుంచి తెచ్చే అప్పులు, కార్పొరేషన్ల రుణాల ద్వారానే సమకూర్చుకోవాల్సి వస్తోంది. నాలుగేళ్లుగా బడ్జెట్, అకౌంటింగ్ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ప్రస్తుత అప్పు సుమారు రూ.11 లక్షల కోట్లు. కనీసం 8 శాతం వడ్డీ లెక్కగట్టినా ఏడాదికి రూ.88 వేల కోట్లు వడ్డీ రూపంలోనే చెల్లించాలి. 30 ఏళ్లలో ఈ అప్పు తీర్చాలన్నా ఏడాదికి రూ.36 వేల కోట్లు అవసరం. అంటే అప్పులు తీర్చేందుకే ఏడాదికి రూ.1.24 లక్షల కోట్లు అవసరం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ చాలా కష్టం. రాష్ట్రంలో కోటి మంది నిత్యం నాణ్యతలేని మద్యం సేవిస్తున్నారు. దీనివల్ల వారి కుటుంబాలు చితికిపోవడంతో పాటు అనారోగ్యానికి గురౌతున్నారు. రూ.30 వేల కోట్ల మద్యం ఆదాయం లెక్కలోకి రాకుండా పక్కకు పోతోంది. మద్యం కంపెనీలన్నీ వైకాపాకు చెందినవారి చేతుల్లోనే ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని డిస్టిలరీలతో పాటు ఈ అవకతవకలపై విచారణ చేయించాలి.

