Andhra PradeshHome Page Slider

భోళా శంకర్ టికెట్ రేటు పెంపునకు జగన్ సర్కార్ రెడ్ సిగ్నల్

ఏపీలో గత రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈనెల 11న రిలీజ్ కానున్న మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమాకు టికెట్లు రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిని తిరస్కరించింది. రెండు రోజుల కిందట సినిమా ఫంక్షన్ వేదికపై చిరంజీవి ప్రభుత్వం పై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని రాష్ట్రంలో రోడ్లు, ప్రజా సమస్యలు ప్రత్యేక హోదా లాంటి అంశాలను పట్టించుకోవాలని పరోక్షంగా ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చిరంజీవి వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి పై మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని తదితరులు తీవ్రంగా స్పందించారు. తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే బోళా శంకర్ నిర్మాతలు సినిమా టికెట్లు రేట్లు పెంపు పై రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. సినిమా ఆటోగ్రఫీ చట్టం ప్రకారం నిర్దేశిత రేట్లపై అదనంగా వసూలు చేయాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.నిర్మాతల దరఖాస్తులను పరిశీలించి సినిమా బడ్జెట్ సాంకేతిక నిపుణులు తదితరాంశాలను పరిగణలోకి తీసుకొని ఎంత మేరకు పెంచుకోవచ్చని ప్రభుత్వం జీవో రూపంలో అనుమతిస్తుంది. ఈ క్రమంలో భాగంగానే ఈ నెల 11న విడుదలవుతున్న బోళాశంకర్ చిత్రానికి టికెట్ రేట్ ల పెంపు కోసం నిర్మాతలు దరఖాస్తు చేసుకోగా బడ్జెట్ తో పాటు దరఖాస్తులు అసంపూర్తిగా ఉన్నాయని పలు డాక్యుమెంట్లు జత చేయలేదని ప్రభుత్వ వర్గాలు తిరస్కరించినట్లు తెలిసింది.