ఐరోపా చమురు సంక్షోభంలో అమెరికా జోక్యం
ప్రపంచీకరణ వేగంగా జరుగుతున్న ప్రస్తుత పరిస్ఖితుల్లో యుద్ధం అంటూ మొదలైతే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అదీ కాక అమెరికా, రష్యా లాంటి అగ్ర దేశాలు ఆ యుద్దంలో కలిస్తే దాని ప్రభావం మొత్తం ప్రపంచ దేశాలన్నింటి మీద ఉంటుంది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం నెలల తరబడి కొనసాగుతూండడంతో ఐరోపాలో తీవ్ర చమురు సంక్షోభం ఏర్పడింది. ఇటీవల నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్ పునరుద్ధరించిన రష్యా దాని ద్వారా కేవలం 20 శాతం మాత్రమే సరఫరా చేస్తోంది. ఇది కేవలం ఐరోపా సమాఖ్యపై ప్రతీకారమేనని అమెరికా భావిస్తోంది. చమురు సంక్షోభం ఏర్పడి విద్యుత్తు, గ్యాస్ ధరలు పెరిగితే ఐరోపాపై అమెరికా ఆంక్షలకు ఆంటంకమవుతుంది. దీనితో పశ్చిమదేశాల ఆంక్షలకు రష్యా ప్రతీకారంగానే ఇలా ప్రవర్తిస్తునట్లు అమెరికా ఆరోపిస్తోంది. ఈసమస్య పరిష్కారానికి వైట్‌హౌస్ ప్రెసిడెన్షియల్ కోఆర్డినేటర్ ఫర్ గ్లోబల్ ఎనర్జీ అమోస్ హోచ్‌స్టెయిన్‌ను మంగళవారం యూరప్‌కు పంపించింది అమెరికా. పారిస్, బ్రస్సెల్స్‌లో ఆయన ఎనర్జీ టాస్క్‌ఫోర్స్‌తో చర్చలు జరపనున్నారు. గ్యాస్‌ను పొదుపుగా వాడుకొని 15 శాతం వినియోగాన్ని స్వచ్ఛందంగా తగ్గించుకోవాలని ఈయూ సభ్య దేశాలను కోరింది. చలికాలం కంటే ముందే గ్యాస్ నిల్వలను నింపుకోవడాన్ని మరింత కష్టంగా మార్చడానికే రష్యా కోతలు విధిస్తోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవిషయాలన్నింటిపై బ్రస్సెల్స్‌లో ఐరోపా సమాఖ్య ఇంధన మంత్రుల సమాలోచన జరగబోతోంది.