InternationalNewsNews Alert

అమెరికా చైనా మాటల యుద్ధం

Share with

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఓవైపు ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న నేపధ్యంలో చైనా,తైవాన్ మధ్య తారస్ధాయికి చేరుతున్న ఉద్రిక్తతలు కలవరపరుస్తున్నాయి. ఇది చివరికి చైనా,అమెరికా ఘర్షణగా మారుతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి తైవాన్ గురించిన వివాదం రెండు అగ్ర రాజ్యాల మధ్య చిచ్చురేగేలా చేస్తుంది. అమెరికా- చైనా అధినేతల మధ్య మాటల తూటాలు పేలాయి. పరస్పరం ఘాటు హెచ్చరికలు జారీ చేసుకొన్నారు. బైడెన్‌- జిన్‌పింగ్‌ మధ్య రెండున్నర గంటల సమావేశం సెగలు పుట్టించింది. ఇరు దేశాల మధ్య విభేదాలను భేటీలో స్పష్టమయ్యాయి. తైవాన్‌ ద్వీపం పూర్తిగా తనదేనని ముందునుంచీ చెబుతూ వస్తున్న చైనా ఈ మధ్య దూకుడు పెంచుతోంది. దాన్ని తనలో కలిపేసుకునేందుకు అవసరమైతే బలప్రయోగానికీ వెనకాడేది లేదని హెచ్చరికలు చేస్తోంది. అదే జరిగితే తైవాన్‌కు రక్షణగా నిలుస్తామన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటన ఉద్రిక్తతలను మరింతగా పెంచింది.

ఏమిటీ వివాదం?
1949లో చైనాలో అంతర్యుద్ధం ముగిసిన తరువాత మావో నేతృత్వంలో కమ్యూనిస్టులు విజయం సాధించారు. దాంతో నాటి దేశ పాలకుడు, మావో ప్రత్యర్థి చియాంగ్‌కై షేక్‌ దేశం విడిచి తైవాన్‌లో తలదాచుకున్నాడు. అప్పటి నుంచీ తైవాన్‌ దాదాపుగా స్వతంత్రంగానే కొనసాగుతూ వస్తోంది. దాదాపు 2.3 కోట్ల జనాభా ఉన్న తైవాన్‌ ప్రజాస్వామ్యయుతంగా
ఎన్నికైన ప్రభుత్వ పాలనలో ఉంది. చైనా మాత్రం 70 ఏళ్లుగా తైవాన్‌ను మాతృదేశానికి ద్రోహం తలపెట్టిన భూభాగంగా పరిగణిస్తూ వస్తోంది. దాన్ని చైనాలో భాగంగానే గుర్తించాలంటూ ప్రపంచ దేశాలన్నింటిపైనా నిత్యం ఒత్తిడి తెస్తుంటుంది. తైవాన్‌ దౌత్య కార్యాలయానికి అనుమతిచ్చినందుకు యూరోపియన్‌ యూనియన్‌ సభ్య దేశమైన లిథువేనియాతో వాణిజ్య సంబంధాలను చైనా పూర్తిగా తెంచేసుకుంది! కేవలం 16 దేశాలు మాత్రమే తైవాన్‌తో అధికారికంగా దౌత్య సంబంధాలు నెరుపుతున్నాయి. అత్యధిక దేశాలు అనధికారికంగా సంబంధాలు కొనసాగిస్తున్నాయి. తైవాన్‌ అంతర్జాతీయ హోదాపై ఒక స్పష్టతంటూ లేదనే చెప్పాలి. చైనా మధ్య వివాదం కొనసాగుతుంది

అమెరికాకేం సంబంధం?
చైనాలో విప్లవం నేపథ్యంలో 1970ల దాకా 30 ఏళ్ల పాటు తైవాన్‌ ప్రభుత్వాన్నే చైనా మొత్తానికీ ప్రతినిధిగా అమెరికా గుర్తిస్తూ వచ్చింది. కానీ చైనాకు, అమెరికాకు 1979లో దౌత్య తదితర సంబంధాలు ఏర్పాటయ్యాయి. దాంతో తైవాన్‌తో దౌత్య తదితర బంధాలకు, రక్షణ ఒప్పందాలకు అమెరికా అధికారికంగా స్వస్తి పలికింది. కానీ అనధికారంగా మాత్రం తైవాన్‌తో సంబంధాలను విస్తృతంగా కొనసాగిస్తూనే వస్తోంది. చైనా హెచ్చరిస్తున్నప్పటికీ ఆత్మరక్షణ కోసం తైవాన్‌కు అమెరికా ఆయుధాలను విక్రయిస్తుంది. ఏకంగా 1,800 కోట్ల డాలర్లకు పైగా విలువైన ఆయుధాలను విక్రయించింది. తైనాన్ పై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అమెరికా యుద్ధ నౌకలు తైవాన్‌ జలసంధి గుండా తరచూ రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో తైవాన్‌తో సైనిక బంధాన్ని అమెరికా మరింతగా పెంచుకుంది.ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను కాపాడటమే తమ లక్ష్యమని అమెరికా పైకి చెబుతూ ఉంటుంది. అందుకోసం చైనా, తైవాన్‌ మధ్య యథాతథ స్థితి కొనసాగాలన్నది అమెరికా వాదన. బైడెన్‌ కూడా ఈ ధోరణిని మరింతగా కొనసాగిస్తున్నారు.

చైనా దాడికి దిగేనా?
తైవాన్‌ను విలీనం చేసుకునేందుకు యుద్దనికైనా వెనకాడేది లేదని చైనా పదేపదే చెబుతూనే ఉంది. 2049కల్లా ‘అత్యంత శక్తిమంతమైన చైనా’ కలను నిజం చేసేందుకు తైవాన్‌ విలీనం తప్పనిసరని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ప్రకటించారు . చైనా ఫైటర్‌ జెట్లు, బాంబర్లు, నిఘా విమానాలు నిత్యం తైవాన్‌ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. ఇవన్నీ త్వరలోనే సైనిక ఘర్షణకు దారి తీయొచ్చంటున్నారు.

పెరుగుతున్న ‘స్వాతంత్య్రాభిలాష’
2016లో సై ఇంగ్‌ వెన్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తైవాన్‌లో పూర్తి ‘స్వాంతంత్య్రాభిలాష’ నానాటికీ పెరిగిపోతోంది. చైనా, తైవాన్‌ మధ్య 1992లో కుదిరిన ‘ఒకే చైనా’ రాజకీయ ఒప్పందాన్ని అర్థం లేనిదిగా ఇంగ్ వెన్‌ కొట్టిపారేస్తుంటారు. తాజాగా యుద్ధ నౌకలో పర్యటించి ఉద్రిక్తతలను మరింతగా పెంచారు ఇంగ్ వెన్. స్వీయ రక్షణకు ఎంత దూరమైనా వెళ్తామనే ప్రకటనలతో ఇంగ్ వెన్ మరింత వేడి పుట్టించారు.