బీఎస్ఎన్ఎల్‌కు భారీ ప్యాకేజీ
ప్రభుత్వ రంగ టెలికం సంస్ధల్లో ఒకటైన బీఎస్ఎన్ఎల్‌కు ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించింది. BSNLలో భారత్ బ్రాడ్‌బ్రాండ్ నెట్‌వర్క్ విలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం BSNLకి లక్షా 64 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ మూలధనాన్ని ఫైబర్ సేవల పటిష్టతకు, సర్వీసులు , నెట్‌వర్క్ పునరుద్ధరణ తదితర అంశాలపై వినియోగించాలని ప్రభుత్వం దృష్ట్రి పెట్టింది. ఈ ప్యాకేజీలో రూ. 43,964 కోట్లు నగదు గాను, మిగత రూ.1.2 లక్షల కోట్లు నగదుయేతర రూపంలో నాలుగేళ్ల వ్యవధిలోనే అందించనున్నట్టు కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ఇంతకముందు ఇచ్చిన 74,000 కోట్ల ప్యాకేజీ BSNLకు ఊపిరినిచ్చిందని , తద్వారా కంపెనీ మంచి లాభాలు నమోదు చేస్తోందని మంత్రి గుర్తుచేశారు.
తాజాగా ప్రకటించిన ఈ ప్యాకేజీతో BSNLని లాభాల్లోకి తీసుకువస్తామని , ఇప్పటివరకు ఉన్న అప్పులని వాటాలుగా మారుస్తామన్నారు. 1,20,000 సర్కిళ్లలో 4జీ సేవలు అవసరమని తెలిపిన కేంద్ర మంత్రి , దీనికోసం బలమైన ప్రభుత్వ రంగ సంస్ధ అవసరమని పేర్కొన్నారు. ఫైబర్ నెట్‌వర్క్ విస్తరణ , బ్యాలెన్స్ షీట్ తగ్గించడం , సేవలను మెరుగుపరచడం అనే అంశాలు ప్యాకేజీలో ఉన్నయన్నారు. ప్రతి నెలా కొత్తగా లక్షల్లో కనెక్షన్స్ ఇస్తామని , అతి త్వరలో 5G సేవలని అందుబాటులోకి తెస్తామని చెప్పారు.