Andhra PradeshTelangana

తెలుగు రాష్ట్రాల మధ్య పోలవార్

Share with

ఆంధ్రప్రదేశ్‌ గోదావరిపై నిర్మిస్తున్న భారీ సాగునీటి ప్రాజెక్టు పోలవరం. అనేక వివాదాల మధ్య ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రమే తీసుకుంది. ఏళ్లుగా సాగుతున్న పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. అయితే ఇన్నాళ్లూ ప్రాజెక్టు నిర్మాణంపై ఎలాంటి వివాదాలు లేవు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరికి వచ్చిన వరదలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చురేపుతున్నాయి. దీనికి తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆజ్యం పోశారు. దీంతో ఇప్పుడు రెండు రాష్ట్రాల అధికార పార్టీల మధ్య పోలవరం.. రణం రాజేస్తోంది.

తాజాగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ గోదావరి వరదలతో భద్రాచలంతో పాటు పలు గ్రామాలు నీట మునగడానికి పోలవరమే కారణమని సంచలన ఆరోపణ చేశారు. పోలవరం ఎత్తు ఎక్కువగా నిర్మించడంతోనే నీరు టెంపుల్‌ సిటీ భద్రాచలంతోపాటు అనేక గ్రామాలను గోదావరి ముంచెత్తిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి ఆలస్యంగా నీళ్లు విడుదల చేసినందు వల్లే భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగిందని… ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం కరకట్టతో పాటు ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు సీఎం కేసీఆర్ రూ.1,000 కోట్లతో తక్షణ కార్యచరణ ప్రకటించారని తెలిపారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని మొదటి నుంచి డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఆంధ్రాలో విలీనం చేసిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలన్నారు పువ్వాడ. గోదావరి వరదల నుంచి టెంపుల్‌ సిటీ భద్రాచలాన్ని కాపాడాలని… పోలవరం టెంపుల్‌ సిటీకి శాపంగా మారిందన్నారు. పువ్వాడ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భద్రాచలం ఇవ్వాలని అడిగితే ఇచ్చేస్తారా?

గోదావరి వరదలను తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ రాజకీయం చేయడాన్ని ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తప్పుపట్టారు.పోలవరం నిర్మాణం పూర్తిగా శాస్త్రీయంగా జరుగుతోందని తెలిపారు. ప్రాజెక్టుకు అన్నిరకాల అనుమతులు ఉన్నాయని తెలిపారు. అశాస్త్రీయ ఆరోపణలతో రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టొద్దని సూచించారు. పోలవరంతోనే భద్రాచలం మునిగిపోయిందనడం కరెక్ట్‌ కాదని సూచించారు. 45.72 మీటర్ల ఎత్తు వరకు కేంద్రం అనుమతులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అన్ని అంశాలు పరిశీలించాకే పోలవరానికి అనుమతులు వచ్చాయన్న అంబటి.. పోలవరం ముంపు ఉంటుందనే 7 మండలాలను ఏపీలో కలిపారని గుర్తుచేశారు. వరదల సమయంలో రాజకీయాలు తగవని మంత్రి అంబటి హితవు పలికారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ 5 గ్రామాలు ఇచ్చేయాలని అంటున్నారని.. భద్రాచలం ఇవ్వాలని అడిగితే ఇచ్చేస్తారా? అని ప్రశ్నించారు. ఏదైనా సమస్య ఉంటే కేంద్రంతో మాట్లాడాలని గానీ, ఇలా వివాదం చేయకూడదని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ అవసరం లేదని, అందరం కలిసి మెలసి ఉండాల్సిన వాళ్లమని తెలిపారు.