తాను బతికుండగా పోలవరం పూర్తి కాదంటున్న ఉండవల్లి
పోలవరంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బతికి ఉండగా పోలవరం పూర్తికావడం అసాధ్యం అని హట్ కామెంట్లు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియదని చెప్పిన ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుకి ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో నేను చెప్పిందే ఇప్పుడు అంబటి రాంబాబు చెబుతున్నారని … అదే నిజమన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇటీవల వచ్చిన వరదల్లో పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి కారణం ఎవరని, ఈ విషయంలో ఎవరిపై చర్యలు తీసుకుంటున్నారని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలని కోరిన ఉండవల్లి.. నిర్వాసితులను సమాధి చేసే ఆలోచన ఎందుకు ? చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం మునిగిపోతుందని తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నారని, అసలు పోలవరం డ్యామ్ కట్టలేదు.. డ్యామ్ కట్టకుండానే భద్రాచలం మునిగిపోయిందంటున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. పోలవరం విషయంలో గతంలో టీడీపీ ప్రభుత్వం ఎలా ఉందో.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వమూ అలాగే ఉందన్నారు. పోలవరాన్ని కట్టే ఉద్దేశ్యం కేంద్రానికి లేదన్నారు. అడిగే ధైర్యం ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలకు లేదు అంటూ ఘాటు విమర్శలుచేశారు. పోలవరం సహా విభజన హామీలను సాధించుకునే పరిస్థితి లేదని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వారిపై ప్రధాని మోదీ ఈడీ పేరుతో భయపెడుతున్నారని అన్నారు. సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ విచారణ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు