NationalNews

పదవి విరమణ తర్వాత కూడా సకల సౌకర్యాలు

Share with

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ నెల 25న ముగియనుంది. ఈ నెల 24న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు… రాష్ట్రపతికి వీడ్కోలు కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు హాజరవుతారు. ఈ నెల 25న రాష్ట్రపతి భవన్ ఖాళీ చేయాల్సి ఉన్నా రెండ్రోజుల ముందే ఆయన తనకు కేటాయించిన 12 జన్‌పథ్ బంగ్లాకు సామాన్లు తరలించేశారు. ఇదే బంగ్లాలో రెండు దశాబ్దాలు పైగా రామ్ విలాస్ పాశ్వాన్ ఉన్నారు. ఆయన మరణం తర్వాత ఈ బంగ్లా ఖాళీగా ఉంది. ఇటీవలే రామ్‌నాధ్ కోవింద్ కుమార్తె స్వాతి కోవింద్… ఆయనకు కేటాయించిన బంగ్లాలో మార్పులు, చేర్పులు చేయించుకున్నారు. ఈ బంగ్లా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసానికి పక్కనే ఉండటం విశేషం.

రిటైర్‌‌మెంట్ తర్వాత కోవింద్‌కు నెలకు లక్షన్నర పెన్షన్‌తోపాటు… సిబ్బంది కోసం నెలకు 60 వేల రూపాయలు భృతి అందిస్తారు. ఆయనకు కేటాయించిన బంగ్లాకు ఎలాంటి రెంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. కరెంట్, మొబైల్, ల్యాండ్‌లైన్ ఫోన్, ఇంటర్‌నెట్, నీటి బిల్లులు అన్నీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. రామ్ నాథ్ కోవింద్‌కు పదవీ విరమణ తర్వాత కారుతోపాటు డ్రైవర్‌ను కేటాయిస్తారు. వాటితోపాటుగా… ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు ఉచితం విమాన, రైలు ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. రాష్ట్రపతితో పాటు మరొకరికి ప్రయాణం సైతం ఉచితం. పదవీ విరమణ చేసిన రాష్ట్రపతికి ఐదుగురు సిబ్బందిని సహాయకులుగా నియమిస్తారు. ఇద్దరు సెక్రటరీలు నిత్యం అందుబాటులో ఉంటారు. ఢిల్లీ పోలీసులు పూర్తి రక్షణ కల్పిస్తారు.