NationalNewsNews Alert

ఢిల్లీలోనూ `తెలుగుదనాన్ని` వీడని వెంకయ్య నాయుడు

Share with

ముప్పవరపు వెంకయ్య నాయుడు.. తెలుగుదనం ఉట్టిపడే జాతీయ స్థాయి రాజకీయ నాయకుడు. ఆహార్యం, మాట తీరు, పంచకట్టు.. అడుగడుగునా సగటు తెలుగు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే వెంకయ్య నాయుడును దేశంలో గుర్తు పట్టని వారు లేరంటే అతిశయోక్తి కాదు. చిన్నప్పుడు భుజంపై భారతీయ జనతా పార్టీ జెండాను మోసిన ఈ పెద్దాయన అనతికాలంలోనే ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడూ అయ్యారు. అంతేకాదు.. కేంద్రంలో పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించడంతో పాటు ఏకంగా దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన ఉపరాష్ట్రపతి కూడా అయ్యారు. బుధవారం ఉపరాష్ట్రపతిగా రిటైర్‌ అయిన వెంకయ్య నాయుడు వయసు 73 ఏళ్లు. అయినా.. తుదిశ్వాస ఉన్నంత వరకూ ప్రజా సేవ చేస్తానంటున్నారు.

రైతు కుటుంబాల సంక్షేమానికి..

వెంకయ్య నాయుడి రాజకీయ ప్రయాణం గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిరాటంకంగా కొనసాగింది. 1948 జూలై 1న నెల్లూరు జిల్లా చవటపాలెం గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వెంకయ్య నాయుడు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి లా పట్టా అందుకున్నారు. రంగయ్య నాయుడు, రమణమ్మ దంపతులకు జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచే అణగారిన వర్గాలు, రైతు కుటుంబాల సంక్షేమం కోసం పాటు పడ్డారు.

చిన్న వయసులోనే పెద్ద పదవులు

వెంకయ్యలోని పోరాట పటిమ, ప్రజల కోసం పడే తపన కారణంగా చిన్నప్పటి నుంచే పదవులు వరించాయి. 1965లో ఏబీవీపీ నాయకుడిగా ఉన్నప్పుడు పహిల్వాన్‌ కాంతారావుతో కుస్తీ పట్టిన తర్వాత విద్యార్థి నాయకుడిగా తనకు మంచి గుర్తింపు వచ్చిందని వెంకయ్య చెప్పారు. 1972లో జై ఆంధ్ర ఉద్యమంలోనూ క్రియాశీల పాత్ర పోషించారు. 1973-74లో ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అక్కడ నేర్చుకున్న నాయకత్వ లక్షణాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. 1977-80 మధ్య కాలంలో బీజేవైఎం అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1978లో 30 ఏళ్ల వయసులోనే ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నాటి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తొలిసారి అడుగు పెట్టారు. రెండేళ్లకే బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిగానూ నియమితులయ్యారు. 1980లో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగానే జాతీయ స్థాయిలో సేవలందించే అదృష్టాన్ని దక్కించుకున్నారు. 1985లో బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శిగా, 1988లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ఆత్మకూరులో ఓటమితో ఢిల్లీకి..

ఉదయగిరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వెంకయ్య ఉదయగిరికి మారిన తర్వాత ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన దృష్టి ఢిల్లీపైకి మళ్లింది. తర్వాత కర్ణాటక తరఫున రాజ్యసభకు ఎన్నికై బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు సైతం చేపట్టి ఉత్తర భారతానికే పరిమితమైన పార్టీ అనే ముద్రను తుడిచి పెట్టేశారు. వాజ్‌పేయి నేతృత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు వెంకయ్య నాయుడు రైతులకు సేవలందించేందుకు ఏరికోరి గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకున్నారు. వాజ్‌పేయి రావాణా శాఖ లేదా సమాచార శాఖ ఇస్తానన్నా కాదనకుండా ఢిల్లీ వెళ్లినా తన గ్రామీణ నేపథ్యాన్ని వీడలేదు. మొత్తానికి పదవుల కోసం తాను వెంపర్లాడలేదని, పదవులే తనను వెతుక్కుంటూ వచ్చాయని వెంకయ్య చెప్పడం విశేషం.

అదొఒక్కటే వెలితి..

వెంకయ్య నాయుడు అంటే ప్రధాని మోదీకి ప్రత్యేక అభిమానం. అందుకే 2014లో మోదీ తన మంత్రివర్గంలో ఆయనకు సమాచార ప్రసార శాఖతో పాటు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. వెంకయ్యను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పించేందుకే ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టారని విమర్శలొచ్చినా దేశ రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఇచ్చి సముచితంగా గౌరవించారు. వెంకయ్య కూడా క్రమశిక్షణ కలిగిన సైనికుడిలా మోదీ చెప్పగానే ఉపరాష్ట్రపతి పదవిని స్వీకరించారు. అయితే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రతిపక్షంలో ఉండి నాటి యూపీఏ సర్కారుపై పోరాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని తిరుపతి బహిరంగ సభలో వెంకయ్య సమక్షంలోనే మోదీ హామీ ఇచ్చారు. అయితే, మోదీ ప్రభుత్వంలో మంత్రిగా, తర్వాత ఉపరాష్ట్రపతిగా సుదీర్ఘ ప్రజా జీవితంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పించలేకపోవడం ఒక్కటే వెంకయ్య జీవితంలో వెలితిగా నిలిచింది. రాజ్యసభ చైర్మన్‌గా మాత్రం ఐదేళ్లు సంతృప్తికరంగా గడిచిందని వెంకయ్య నాయుడు చెప్పారు. రాజ్యసభను పేపర్‌ లెస్‌గా మార్చారు. సభ్యులు మాతృభాషలో మాట్లాడేలా ప్రోత్సహించారు. వారి ప్రసంగాలను అప్పటికప్పుడే 22 భాషల్లోకి అనువదించే ఏర్పాట్లు చేశారు. ఎంపీలు రాజ్యసభకు వచ్చేందుకు ఎలక్ట్రిక్‌ కార్లను ప్రవేశపెట్టారు.

Venkaiah Murmu

ప్రజా జీవితంలో క్రియాశీలకంగానే..

తన ప్రయాణం ముగియలేదని, ఇంకా మిగిలే ఉందంటూ తుది శ్వాస విడిచే వరకూ ప్రజా సేవకే తన జీవితం అంకితమని వెంకయ్య నాయుడు అన్నారు. అలాగని మళ్లీ బీజేపీ సభ్యత్వం తీసుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా అంటే.. అదీ కాదన్నారు. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేది లేదని, ప్రజా జీవితంలో క్రియాశీలకంగా మాత్రం ఉంటానని కుండబద్దలు కొట్టారు. దేశంలో ప్రస్తుత రాజకీయాలు, ప్రజా సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తూనే ఉంటానన్నారు. ఉపరాష్ట్రపతి పదవిని పూర్తి చేసినందున.. రాష్ట్రపతి కావాలని.. లేకుంటే విశ్రాంతి తీసుకోవాలనే సిద్ధంతాన్ని తాను నమ్మబోనని వెంకయ్య స్పష్టం చేశారు.