NewsTelangana

తెలంగాణలో ఇంజనీరింగ్ ఫీజులమోత

Share with

నేటి విద్యావ్యవస్థలో విద్యార్ధులు చదువుకునే రోజులు పోయి, చదువుకోనే రోజులు వచ్చాయి. ఇక ఇంజనీరింగ్ లాంటి సాంకేతిక విద్య అయితే సామాన్య ఉద్యోగ, వ్యాపారాలు చేసుకొనే తల్లిదండ్రుల పాలిట పెను భారమే. వారి ఆదాయంలో అధిక మెత్తాన్ని పిల్లల కాలేజీ ఫీజుల కోసమే వెచ్చించాల్సి వస్తోంది. లేకుంటే అప్పొసొప్పో కూడా చేసి చదివిస్తున్నారు. తెలంగాణా ఫీ రెగ్యులేటరీ కమిటీ FRC నిర్ణయం ప్రకారం త్వరలో ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజులు పెరగబోతున్నాయి. కాలేజీల యాజమాన్యాలతో అధికారుల చర్చలు మరో రెండురోజుల్లో ముగియనున్నాయి. తర్వాత ఈ నెలాఖరున జరిపే మీటింగ్‌లో ఫీజుల పెంపుపై రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయానికి రావచ్చు. తమ నివేదికను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉందని  ఎఫ్‌ఆర్‌సీ అధికారులు చెప్పారు. ఇంజనీరింగ్‌ ప్రవేశాల నాటికి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే వీలుందని తెలిపారు. కనీస ఫీజు రూ.45 వేలకు పెంచే అవకాశం ఉందని, గరిష్టంగా 30 శాతం వరకు ఫీజులు పెరగవచ్చని తెలియజేసారు. 2022–23కు కొత్త ఫీజుల ఖరారుపై ఎఫ్‌ఆర్‌సీ గత రెండు నెలలుగా అధ్యయనం  చేస్తోంది. కాలేజీల యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతోంది. కాలేజీ వారీగా ఫీజుల పెంపుపై ముందుకెళ్ళే ఆలోచనలో ఉంది. సంబంధిత యాజమాన్యాలు ఆదాయ, వ్యయాలపై సమర్పించిన ఆడిట్‌ నివేదికలను చూస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సీబీఐటీ వంటి పేరు పొందిన కాలేజీలు వార్షిక ట్యూషన్‌ ఫీజును రూ. 2.15 లక్షలకు పెంచాలని కోరుతున్నాయి. 2019 తర్వాత ఫీజులను పెంచలేదు. కరోనా వల్ల కాలేజీలు సెలవులు ప్రకటించడం, ఆన్లైన్ క్లాసులు జరపడం వంటి కారణాల వల్ల గత 4సంవత్సరాలుగా ఫీజులు పెరగలేదు. కాగా ఎఫ్ఆర్సీతో చర్చలు జరిపిన తర్వాత సీబీఐటీ 1.71 లక్షలకు ఒప్పుకుంది. మిగతా కాలేజీలలో కూడా కనీసం 35 వేల నుండి 45 వేలకు పెంచే అవకాశముంది. కాగా రాష్ట్రంలోని 158 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో 20 కాలేజీలలో ట్యూషన్ ఫీజు 35 వేలుగా ఉంది. ఇక 110 కాలేజీల్లో 80 వేలు ఉండగా అది లక్ష దాటే అవకాశం ఉంది. మిగిలిన పేరు పొందిన కాలేజీలలో 1.40 నుండి 1.71 లక్షల వరకూ పెరిగే అవకాశముంది. చాలా కాలేజీలలో సంబంధం లేని లెక్కలను కూడా ఆడిట్ రిపోర్టులో చూపిస్తున్నారు. వీటిని ఎఫ్ఆర్సీ ఒప్పుకోలేదు. కొన్ని కాలేజీలు ఫీజుల పెంపు విషయంలో ప్రభుత్వంతో చర్చించాలి. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీలకు పూర్తి రీయింబర్స్‌మెంట్ ఉంది. ఎంసెట్‌లో 10 వేల లోపు ర్యాంక్ వచ్చిన బీసీలకు కూడా పూర్తి రీయింబర్స్‌మెంట్ ఉంది. తర్వాత ర్యాంక్‌ల వారికి గరిష్టంగా 35 వేలు మాత్రమే ఉంది. కన్వీనర్ కోటా కింద 48 నుండి 50 వేల మంది విద్యార్ధులు ప్రతి సంవత్సరం చేరుతున్నారు. ఈ విషయంలో ఆర్ధికశాఖ నిర్ణయం తీసుకోవాలి. కానీ ఏ రిజర్వేషనూ లేని పిల్లల తల్లిదండ్రులకు ఈఫీజుల పెంపు వల్ల ఎంతో భారం పడనుంది. పైగా ఈ కాలేజీలు కేవలం ట్వూషన్ ఫీజే కాకుండా అనధికారికంగా డొనేషన్లు కూడా వసూలు చేస్తున్నారు.