ఆందోళన ముసుగులో కుట్రదారులు?
ఒక్కసారిగా అగ్నిపథ్ ఆందోళనలతో సికింద్రాబాద్ అట్టుడిగిపోయింది. సికింద్రాబాద్ స్టేషన్ యుద్ధభూమిగా మారిపోయింది. రైల్ రోకో అంటూ కూర్చున్న కొందరు ముందస్తు ప్రణాళిక ప్రకారం ధ్వంస రచన చేశారు. స్టేషన్‌పై అగ్గిరాజేయడంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. పార్సిల్ కార్యాలయంపై దాడికి తెగబడ్డ ఆందోళనకారులు… రైల్వే ట్రాక్ పై బైకులు, స్కూటర్లను దగ్ధం చేశారు. ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టారు. వివిధ ప్రయాణాలకు సిద్ధంగా ఉన్న ఆందోళనకారులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పై బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న రైలు ఇంజిన్ పై బ్యానర్లతో ప్రవేశించిన ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. రైల్వే ఆస్తులను తగులబెట్టారు. ఈ ఘటనలో మొత్తం రూ. 25 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.
9 గంటల సమయంలో మొదలైన ఆందోళన… ప్లాట్ ఫామ్‌పై రైల్వే పోలీసులు లేకపోవడంతో… ఒక్కసారిగా ఉధృతమైపోయింది. క్షణాల్లోనే ఒకటో నెంబర్ నుంచి నిరసనలు మూడో నెంబర్ ప్లాట్‌ఫామ్ వరకు చేరింది. పార్సిల్ కార్యాలయంలోకి చొరబడి చేతికి వచ్చిన సామాన్లు వచ్చినట్టుగా రైల్వే ట్రాక్ పై పడేసి… కాల్చి బూడిద చేశారు. పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతున్నా… అధికారులు సరిగా స్పందించకపోవడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యుద్ధభూమిగా మారిపోయింది. అక్కడ అసలేం జరుగుతుందో అర్థం కాక సామాన్య ప్రయాణీకులు అయోమయానికి గురయ్యారు.
ఓవైపు దట్టమైన పొగ, మరోవైపు ఆస్తుల ధ్వంసం కొనసాగుతున్న తరుణంలోనే… కొందరు దుండగులు ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టారు. క్షణాల్లోనే బోగీలకు మంటలు
అంటుకున్నాయ్. ఈ ఘటనలో ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌తోపాటు, అజంతా ఎక్స్‌ప్రెస్, ఎంఎంటీఎస్ బోగీ కూడా కాలిబూడదయ్యాయ్. విధ్వంసంతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. రైల్వే స్టేషన్లకు వచ్చే రైళ్లను ఎక్కడికక్కడ ఆపేశారు. స్టేషన్లో ఉన్న ప్రయాణీకులను బయటకు పంపించారు. పోలీసులతో ప్రయాణీకులు వాగ్వాదానికి దిగారు.
ఆందోళనకారుల విధ్వంసంతో మూడో ప్లాట్ ఫామ్ వరకు ఫర్నిచర్ పూర్తిగా దెబ్బతింది. ఆందోళన తగ్గకపోవడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

