మీరుంటేనే కదా నేనుండేది!? జగన్ నోట ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్మోహన్ రెడ్డి మారిపోయారా? అసలు జగన్మోహన్ రెడ్డి మారతారా? ఎవరి మాట వినడు జగన్ అని ఆయన గురించి చాలా మంది చెప్తుంటారు. తాను బట్టిన కుందేటి మూడే కాళ్లంటారని ఆయనపై విమర్శ ఉంది. కానీ తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన టికెట్లు నిరాకరించిన నేతలను పిలిపించుకొని మాట్లాడుతూ వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్న తీరు ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిగ్గా మారింది. టికెట్ ఎందుకు నిరాకరించింది చెబుతూ.. వచ్చే రోజుల్లో అందరం బాగుండాలనే ఇలా చేశానని చెప్పడం కొసమెరుపుగా చెప్పాలి. మనమంతా ఒకటే కుటుంబం.. మీరుంటేనే కదా నేనుండేదంటూ ఎమ్మెల్యేలను తనతో ట్రావెల్ అయ్యేలా మాట కలుపుతున్నారు సీఎం జగన్.

వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో విజయం కోసం అటు అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి-జనసేన కూటమి హోరాహోరీ తలపడుతున్నాయి. గెలుపు కోసం నువ్వా-నేనా అన్నట్టుగా రెండు పక్షాలు కొట్లాడుకుంటున్నాయ్. ఈ నేపథ్యంలో టిడిపి జనసేన కూటమికి తోడు, బిజెపి కూడా జతకావడంతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకొని తిరిగి రావడం, సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం.. మొత్తం ఏపీ రాజకీయాలు ఎన్నికల నోటిఫికేషన్ ముందు రసవర్తర దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఏపీలో వచ్చే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం జగన్మోహన్ రెడ్డికి అత్యంత కీలకం. 2019లో 151 సీట్లు గెలవడం కాదు. ఇప్పుడు అధికారాన్ని నిలబెట్టుకోవడం ఆయనకు తప్పనిసరి. ఒకవేళ తేడా వస్తే ఏం జరుగుతుందో.. అందరికంటే బాగా ఆయనకే ఎక్కువ తెలుసు. అందుకోసమే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా… ఇప్పటికీ ఎంతో మంది అభ్యర్థులను జగన్ మార్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరించారు. కొందరు మంత్రులకు కూడా టికెట్‌లు ఇవ్వడం లేదంటున్నారు.

ఇప్పటికే గుమ్మనూరి జయరామ్, గుడివాడ అమర్నాథరెడ్డి లాంటి వాళ్లకు ఈ ఎన్నికల్లో టికెట్లు హుళక్కే అంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు సీఎం జగన్‌పై గుస్సాగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో అసెంబ్లీ సమావేశాలు జరగడం, పైగా, ఎవరికైతే తాను టికెట్లు ఇవ్వలేకపోతున్నాడో.. వారంతా కళ్ల ముందు కనబడటంతో భావోద్వేగమైన దృశ్యం అసెంబ్లీలో కన్పించింది. ఈ సందర్భంగా… సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో వ్యవహరించిన తీరు ఆయన శైలికి భిన్నంగా ఉందా అన్న భావన కలిగిస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇక మారరని, మార్చుకోరని చాలామంది చెబుతారు ఎందుకంటే ఆయన నచ్చింది, నమ్మిందే చేస్తారంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికైతే టికెట్లు ఇవ్వడం లేదో వారందరినీ పిలిపించుకొని వచ్చే ఎన్నికల్లో ఎందుకు సీట్లు ఇవ్వలేదో చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కన్పిస్తోంది. ఏ పరిస్థితుల వల్ల తాను టికెట్ ఇవ్వలేకపోయిందీ వారికి వివరిస్తున్నారు. ఎందుకన్నా కోపం… అంటూ ఎమ్మెల్యేలను జగన్ ఊరడిస్తున్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని రా అన్నా కాఫీ తాగుతామంటూ పిలుపించుకొని జగన్ ఊరడించారట. అందరికీ న్యాయం చేస్తానని మనందరం ఒకటే కుటుంబమని… మీరుంటేనే కదా నేను నిలిచేది దయతో నన్ను అర్థం చేసుకోండంటూ నేతలను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారట.

గతంలో ఓదార్పు యాత్ర ద్వారా ఎందరినో ఓదార్చిన జగన్మోహన్ రెడ్డి తాజాగా ఎమ్మెల్యేలను ఓదార్చుతున్నారట. జగన్మోహన్ రెడ్డి కెరీర్ కథాంశంగా విడుదలైన యాత్ర సినిమా నేపథ్యం కూడా ఇప్పుడే రావడం… నాటి ఓదార్పు యాత్రకు తీసిపోని విధంగా నేడు.. ఎమ్మెల్యేలను జగన్ ఓదార్చడాన్ని కూడా చెప్పుకోవాలి. రీల్ లైఫ్, రియల్ లైఫ్ రెండూ కూడా సింక్ అయ్యాయని అసెంబ్లీలో నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణుకు టికెట్ నిరాకరించి అక్కడ్నుంచి విజయవాడ వెస్ట్ నేత వేలంపల్లి శ్రీనివాస్‌ను తీసుకురావడంతో ఆగ్రహంగా ఉన్న మల్లాది విష్ణు, భుజంపై చేయి వేసి.. అన్నా నన్ను అర్థం చేసుకోండంటూ నేతలను జగన్ సముదాయిస్తున్నారట. ఇప్పటివరకు జగన్ ను చూసిన కోణానికి భిన్నంగా మరో కోణంలో జగన్ ను కన్పిస్తున్నారని.. అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా షాకయ్యారట. ప్రభుత్వం వల్ల ఆయా కుటుంబాల్లో లబ్ది జరిగితేనే ఓటేయాలంటూ చెబుతున్న జగన్… ఇప్పుడు తనను నమ్మితే తనతో ఉంటే భవిష్యత్‌లో తాను గ్యారెంటీ అన్న సంకేతాలను ఇచ్చి… నేతలను బయటకు వెళ్లకుండా ఆపుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

