సొంతింటి కలకు తూట్లు.. లబ్ధిదారుల డబ్బులు చెల్లించని ప్రభుత్వం..!
తిరుపతి నగరంలో పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు గత ప్రభుత్వం 10 వేలకు పైగా గృహాలను నిర్మించి లబ్ధిదారులకు కేటాయించింది. అదేస్ఫూర్తితో మరో ఐదు వేల ఇళ్ల నిర్మాణ బాధ్యతల్ని టిడ్కోకు అప్పగించింది. తిరుచానూరు సమీపంలోని పాడిపేట వద్ద 14.5 ఎకరాల స్థలాన్నికేటాయించింది. లబ్ధిదారుల నుంచి వాటా సొమ్ము వసూలుచేసి పనులు చేపట్టారు. పునాదుల దశకు చేరగానే ఎన్నికలు వచ్చాయి. 2019లో ఏర్పడిన వైకాపా ప్రభుత్వం.. తెదేపా హయాంలో మొదలై 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన ప్రాజెక్టుల్ని నిలిపివేసింది. తిరుపతిలో టిడ్కో ప్రాజెక్టు కూడా రద్దు చేశారు. దీంతో ఇళ్ల నిర్మాణం కోసం తమ వాటాగా రూ.4 కోట్లు చెల్లించిన 2,500 మంది లబ్ధిదారులు.. ఆ సొమ్ము వాపసు ఇవ్వాలని నగర పాలక అధికారులపై ఐదేళ్లుగా ఒత్తిడి తెస్తున్నా ఫలితం శూన్యం.

