NewsTelangana

షర్మిలకు, కవిత ఘాటు రిప్లై

కేసీఆర్ సర్కారుతో అమీతుమీకి సిద్ధమైన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా ఎమ్మెల్సీ కవితపై విరుచుకుపడ్డారు. పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులేగానీ పనితనం లేని గులాబీ తోటల కవితలకు కొదవలేదంటూ విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు కేసీఆర్,కేటీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్న షర్మిల తాజాగా కవితపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఐతే షర్మిల ట్విట్టర్‌కు కవిత ఘాటుగా స్పందించారు. ఇప్పటి వరకు షర్మిలపై చేస్తున్న విమర్శలకు భిన్నంగా కవిత రియాక్ట్ అయ్యారు. అమ్మా.. కమల బాణం ఇది మా తెలంగాణం, పాలేవో, నీళ్లేవో తెలిసిన చైతన్య ప్రజా గణం అంటూ రాసుకొచ్చారు. నిన్నటి వరకు పులివెందులలో ఓటు.. ఇప్పుడు తెలంగాణ రూటని.. కమలం కోవర్ట్.. ఆరెంజ్ ప్యారెట్టు అంటూ ట్వీట్ చేశారు. మీలాగా పొలిటికల్ టూరిస్టును కానని.. రాజ్యం వచ్చాక రాలేదని.. ఉద్యమంలో పుట్టిన మట్టి కవితనంటూ కవిత ట్వీట్ చేశారు. మొత్తంగా ఇద్దరు మహిళల మధ్య వార్ రాజకీయ పార్టీల మధ్య అగ్గి రాజేస్తుంటే రెండు పార్టీ అభిమానులు నెట్టింట్లో ఆ మంటలకు మరింత ఆజ్యం పోస్తున్నారు.