సాయికృష్ణ అదృశ్యం కేసు: బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా!
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో బాధితులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అండగా నిలిచారు. ఈ ఘటనపై తీవ్ర ఆందోళనలో ఉన్న సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తన కుమారుడి అదృశ్యంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని ఆమె ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. బాధితుల ఆవేదనను పూర్తిగా విన్న సీఎం చంద్రబాబు, వారికి ధైర్యం చెప్పారు.
ఈ కేసుపై ఇప్పటికే ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా స్పందించిందని ముఖ్యమంత్రి బాధితులకు తెలిపారు. ఘటనకు సంబంధించి ఇప్పటికే స్థానిక సీఐని సస్పెండ్ చేశామని, కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయడానికి ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తప్పు చేసింది ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సమగ్ర విచారణ జరిపి నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం భరోసా ఇవ్వడంతో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రితో భేటీ అనంతరం సాయికృష్ణ మేనమామ ముళ్లపూడి నవరంగ్ మీడియాతో మాట్లాడుతూ తమ ఆవేదనను పంచుకున్నారు. సాయికృష్ణ తల్లి పడుతున్న బాధను సీఎం చంద్రబాబు మానవీయ కోణంలో అర్థం చేసుకున్నారని తెలిపారు. తాము కేవలం సామాన్యులమని, తమకు న్యాయం జరుగుతుందో లేదో అని మొదట్లో తీవ్ర ఆందోళన చెందామని, కానీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ల చొరవ చూశాక తమకు న్యాయం జరుగుతుందనే పూర్తి నమ్మకం కలిగిందని నవరంగ్ పేర్కొన్నారు. రాజకీయంగా తమకు ఎవరిపైనా ఎలాంటి ద్వేషం లేదని, కేవలం తమ బిడ్డకు న్యాయం జరగాలనేదే తమ కోరికని, భవిష్యత్తులో ఇలాంటి అన్యాయం మరే కుటుంబానికి జరగకూడదని ఆయన ఆకాంక్షించారు.

