మంకీపాక్స్‌తో..నో వర్రీస్ అంటున్న డాక్టర్స్
పాతకాలంలో ఇంట్లో ఎవరికైనా ఒంటిపై పొక్కులు రావడం, దద్దుర్లు రావడం వంటివి జరిగినప్పుడు మన పెద్ద వాళ్ళు వెంటనే వాటిని చూసి ఇది తట్టు లేదా ఆటలమ్మ పోసిందని చెప్పేవారు. సాధారణంగా ఇలాంటివి సోకినప్పుడు ఆ సోకిన వ్యక్తిని ఒంటరిగా ఒక గదిలో ఉంచడం, వారికి తేలికపాటి ఆహారం ఇవ్వడం చేస్తారు.అదే విధంగా వారికి పలుచటి వస్త్రాలను తొడిగించి, వేపాకులపై పడుకోబెట్టేవారు. దీంతో ఒక 2 వారాలకే ఆ వచ్చిన తట్టు కానీ, ఆటలమ్మ కానీ పూర్తిగా తగ్గుముఖం పట్టేది. ఆ తరువాత మన పెద్దవారు అప్పట్లో కొంచెం పత్యాల విషయంలో మొండిగా ఉండేవారు కాబట్టి దాదాపు ఒక 6 నెలల పాటు తట్టు లేదా ఆటలమ్మ సోకిన వ్యక్తులతో పత్యం చేయించేవారు. దాంతో ఆ అంటువ్యాధులు పూర్తిగా నయమవుతాయని,మరల తిరిగి దరిచేరవని వాళ్ళు నమ్మేవారు.
అయితే ఇటీవల కాలంలో ప్రపంచంలోని ప్రజలందరినీ కరోనా తర్వాత ఎక్కువగా భయభ్రాంతులకు గురిచేస్తున్న వ్యాధి “మంకీపాక్స్” అని చెప్పవచ్చు.అయితే మన డాక్టర్లు మాత్రం దీనికి అంత భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు.ఈ మంకీపాక్స్‌కు సంబంధించి ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ సి.ప్రభాకర్‌డ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ మంకీపాక్స్ కూడా తట్టు ,ఆటలమ్మ లాంటి అంటువ్యాధి అని చెప్పారు. మనం తట్టు ,ఆటలమ్మ సోకినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో,మంకీపాక్స్ సోకినప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందన్నారు. అంతేకాకుండా మంకీపాక్స్ కొవిడ్‌లా వేగంగా వ్యాప్తి చెందదు అన్నారు. ఇది అంత ప్రాణాంతక వైరస్ కూడా కాదన్నారు. మంకీపాక్స్‌ను అరికట్టడం కూడా పెద్ద కష్టమేమి కాదని ఆయన పేర్కొన్నారు. అయితే ఇంట్లో ఎవరికైనా మంకీపాక్స్ సోకితే పారాసిటమాల్,సిట్రిజన్,ఆంపిక్లాక్స్500 ఎంజీ వంటి మాత్రలు రోజుకు 2 చొప్పున 10 రోజుల పాటు వేసుకోవాలని సూచించారు. అదే విధంగా కొబ్బరి నీళ్ళు, తేలికపాటి ఆహారం వంటివి తీసుకుంటూ హాయిగా విశ్రాంతి తీసుకుంటే చాలని తెలిపారు. ఈ నేపథ్యంలో మంకీపాక్స్ కూడా ఒక అంటువ్యాధి కాబట్టి సోకకుండా తగు జాగ్రత్తలు వహించాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ వైరస్ ఎవరిలో ఉంటుందో తెలియడం కష్టం గనుక జలుబు వస్తే జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు చేతి రుమాలు ఉపయోగించాలని తెలిపారు. మంకీపాక్స్ తుమ్ముల తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుందని చెప్పారు.