moviesviral

‘డాన్ 3’ వివాదం: రణవీర్‌కు ఆర్జీవీ సపోర్ట్!

ఫర్హాన్ అక్తర్ ప్రతిష్టాత్మక చిత్రం ‘డాన్ 3’ నుండి స్టార్ హీరో రణవీర్ సింగ్ తప్పుకోవడం బాలీవుడ్‌లో పెద్ద వివాదంగా మారింది. తమకు ₹45 కోట్ల నష్టం వాటిల్లిందని నిర్మాతలు ఫిర్యాదు చేయడంతో, ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయ్స్ (FWICE) రణవీర్‌పై ‘సహాయ నిరాకరణ’ ప్రకటించింది. ఈ నిర్ణయంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రణవీర్ సింగ్‌కు అండగా నిలిచారు.

ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆర్జీవీ.. రణవీర్‌ను కాకుండా FWICEని బ్యాన్ చేయాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ యూనియన్ వ్యవస్థ అత్యంత పాతబడిపోయిందని, కేవలం తమ పట్టును నిలుపుకోవడానికే ఇలాంటి ప్రదర్శనలు చేస్తోందని మండిపడ్డారు. ఇరు పక్షాల మధ్య ఉన్నది కేవలం ప్రైవేట్ కాంట్రాక్ట్ వివాదమని, ఇందులో సినీ కార్మిక సంఘం తలదూర్చడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. థియేటర్లలో టిక్కెట్లు అమ్మేది, లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించేది రణవీర్ సింగ్ లాంటి స్టార్స్ మాత్రమేనని, FWICE కాదని ఆర్జీవీ స్పష్టం చేశారు. ఈ వివాదంలో రణవీర్ టీమ్ సైతం హుందాగా మౌనం పాటిస్తూ, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని తెలిపింది.