Breaking NewsHome Page Sliderhome page sliderNational

సోనియా రాహుల్‌ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో, సోనియా, రాహుల్‌ గాంధీలపై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టును సోమవారం ఆశ్రయించింది. ట్రయల్ కోర్టు ఆదేశాలను నిలిపివేయాలని , తమ ఫిర్యాదుపై విచారణ కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఈడీ తన పిటిషన్‌లో కోరింది. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీందర్ దుడేజా, ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని కోరుతూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ , ఈ కేసులో ఉన్న వారికి నోటీసులు జారీ చేశారు. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, ట్రయల్ కోర్టు తీర్పు పిఎమ్ఎల్ఏ చట్టం యొక్క ఉద్దేశాన్ని నీరుగార్చేలా ఉందని వాదించారు. హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను 2026, మార్చి 12వ తేదీకి వాయిదా వేసింది.
గతంలో ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ ప్రాసిక్యూషన్ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకునేందుకు రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే నిరాకరించారు.గత మంగళవారం వెలువరించిన ఈ 117 పేజీల తీర్పులో, ఈ కేసులో ఎఫ్ఐఆర్ లేకపోవడాన్ని కోర్టు ప్రధానంగా తప్పుపట్టింది. కేవలం ఒక వ్యక్తి ఇచ్చిన ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించడం చట్టపరంగా చెల్లుబాటు కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద విచారణ జరపాలంటే ముందుగా ఒక షెడ్యూల్డ్ నేరానికి సంబంధించి ఎఫ్ఐఆర్ ఉండాలని, అది లేకుండా ఈడీ చర్యలు తీసుకోవడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది.
ఈ కేసు నేపథ్యాన్ని గమనిస్తే, ‘అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్’ కు చెందిన రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులను కేవలం రూ. 50 లక్షల చెల్లింపుతో ‘యంగ్ ఇండియన్’ సంస్థ ద్వారా సోనియా, రాహుల్ గాంధీలు హస్తగతం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. అయితే, ఈ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తోసిపుచ్చుతున్నారు, ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు చర్య అని వారు వాదిస్తున్నారు. కాగా, ఈ ఏడాది నవంబర్ మరియు అక్టోబర్ నెలల్లో ఢిల్లీ పోలీసులు ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో, ఈడీ దర్యాప్తును స్వతంత్రంగా కొనసాగించవచ్చని ట్రయల్ కోర్టు ఇదివరకే స్పష్టం చేసింది. ప్రస్తుతం హైకోర్టు జారీ చేసిన నోటీసులతో ఈ కేసు మళ్లీ జాతీయ స్థాయిలో ఉత్కంఠ రేపుతోంది.