నేను మంత్రిని అవుతున్న
తెలంగాణలో త్వరలో జరగబోయే కేబినెట్ ప్రక్షాళనలో తనకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు . మునుగోడు లో శుక్రవారం నిర్వహించిన ఒక కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు . తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. త్వరలోనే పార్టీ కోసం తాను చేసిన కృషిని అధిష్టానం గుర్తిస్తుందని, త్వరలోనే శుభవార్త వింటారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా కొనసాగుతున్నారు. అయితే, కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా వెంకటరెడ్డిని ఏఐసీసీ బాధ్యతల్లోకి తీసుకుని, రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గతంలో మంత్రి పదవి విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి, ఇప్పుడు ఇంత బహిరంగంగా ప్రకటన చేయడం వెనుక హైకమాండ్ నుండి బలమైన హామీ వచ్చి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

