NewsTelangana

ఈటల కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడి

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు రణరంగంగా మారింది. మునుగోడు మండలం పలివెలలో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సభ నిర్వహిస్తుండగా.. ఆయన కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడికి దిగడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పిడిగుద్దులు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకుంటూ ఉద్రిక్తత సృష్టించారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘటనలో ఈటల రాజేందర్‌ వ్యక్తిగత సిబ్బంది, గన్‌మెన్లు, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. ఈటల కాన్వాయ్‌లోని పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అక్కడ ఆందోళన జరుగుతుందన్న సమాచారం ఉన్నప్పటికీ.. ఆ ఘర్షణను నివారించడంలో పోలీసులు విఫలమయ్యారు. ఘర్షణ మొదలైన తర్వాత కూడా చురుకుగా వ్యవహరించకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది.