మునుగోడులో డబ్బుల వరద..!
మునుగోడు ఉప ఎన్నికలో విజయమే ధ్యేయంగా టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డబ్బులను ఏరులై పారిస్తున్నాయి. ఈ ఎన్నికలో గెలిచే పార్టీదే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమనే ప్రచారం నేపథ్యంలో ప్రధాన పార్టీల అగ్రనేతలు మునుగోడులోనే తిష్ఠ వేశారు. అంతేకాదు.. స్థానిక ప్రజా ప్రతినిధులను, చోటా మోటా నాయకులను మచ్చిక చేసుకొని.. వారి ద్వారా భారీ స్థాయిలో ఓట్లు రాబట్టుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అందుకే సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు డిమాండ్ పెరిగింది. వారికి లక్షలాది రూపాయలిచ్చి తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఒక్కో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీకి రూ.2-5 లక్షల వరకు ముట్టజెప్తున్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్ 20వ తేదీన, బీజేపీ 21న భారీ సభలకు ప్లాన్ చేస్తున్నాయి. ఈ సభలకు లక్ష మందికి పైగా తరలించాలని భావిస్తున్న ఆ పార్టీల నేతలు దాని కోసం కోట్లాది రూపాయలు సైతం ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు. ఈ సభ వల్ల పంట పొలాలు దెబ్బతింటే నష్ట పరిహారం ఇస్తామని కూడా రైతులను బుజ్జగిస్తున్నారు. గ్రామాల్లో సన్నాహక సమావేశాలు పెడుతూ జనాన్ని తరలించేందుకు తాయిళాలు ముట్టజెబుతున్నారు. కాంగ్రెస్ మండలాల వారీగా సభలు పెడుతూ అక్కడి నుంచి నరుక్కొస్తోంది.
అంతేకాదు.. సభల సందర్భంగా వివిధ పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు సైతం తాయిళాలు సమర్పిస్తున్నారు. మొత్తానికి ఈ ఉప ఎన్నికతో తమ అప్పులన్నీ తీరిపోయాయని, తమ దరిద్రం పోయిందని గల్లీ స్థాయి నాయకులు చెప్పుకుంటున్నారు. ప్రచార రథాలు సైతం రంగంలోకి దిగాయి. ఒక్కో రథాన్ని తయారు చేసేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించారు. ఈ రథం వెంట వెళ్లే పార్టీ కార్యకర్తలకు రోజువారీ ఖర్చులు కూడా లక్షల్లోనే అవుతున్నాయని సమాచారం.