ఎన్నికల దిశగా కార్యాచరణకు వైయస్సార్సీపీ శ్రీకారం
ఈ నెల 9న పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు పదాథికారులతో విజయవాడలో సమావేశం
ఇంటింటికి ప్రచారంపై దిశ నిర్దేశం చేయనున్న జగన్
ఇకనుంచి పార్టీ కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయింపు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శంఖారావం పూరించనున్నారు. ఇకపై ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా రోజువారి సమీక్షలతో పాటు ఎక్కువ సమయం పార్టీ కార్యకలాపాలకు కేటాయించాలని నిర్ణయించారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం కానున్నది. ఇంతకుముందే నిర్దేశించిన విధంగా ఈ నెల 9వ తేదీన విజయవాడలో జరిగే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు పదాథికారులతో సమావేశంలో భవిష్యత్తు ఎన్నికల వ్యూహానికి సంబంధించి దిశా నిర్దేశం చేయమన్నారు. ఈ మేరకు విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో ఇందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ ల నుండి సోషల్ మీడియా కమిటీ సభ్యుల వరకు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను పార్టీకి అనుకూలంగా మలుచుకోవటంతో పాటు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటా ప్రచారం నిర్వహించే విధంగా సమావేశంలో సీఎం జగన్ మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. అంతే కాదు ఇకపై సోషల్ మీడియా వేదికగా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచార నిర్వహించే విధంగా క్యాడర్ ను సిద్ధం చేయనున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో కొందరు ఎమ్మెల్యేలు విఫలం కావడంతో వారిపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకపై నియోజకవర్గస్థాయిలో మండల గ్రామస్థాయి ముఖ్య నేతలు జిల్లా స్థాయిలో నియోజకవర్గాల పార్టీ నాయకులతో ప్రజలతో మమేకం కావటం వారి సమస్యలను తెలుసుకోవడం పరిష్కరించటంతో పూర్తిస్థాయిలో ప్రభుత్వంపై విశ్వసనీయత పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

పార్టీ ప్లీనరీ తర్వాత విజయవాడలో జరిగే ప్రతినిధుల సభ చాలా ప్రాధాన్యత సంతరించుకోనుంది. రీజనల్ కోఆర్డినేటర్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు మొదలు గ్రామపంచాయతీ వరకు ప్రజాప్రతినిధులు ఒకే గూటికి చేర్చి ఆపై ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు జగన్ వ్యూహరచన చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని మరోసారి ఆశీర్వదించాల్సిందిగా కోరేలా జగన్ పార్టీ క్యాడర్ కు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఆహ్వానితులు మాత్రమే హాజరవుతారని సుమారు ఎనిమిది వేల మంది వరకు ప్రతినిధులు వస్తారని ఇది పూర్తిగా ఆహ్వానితులతోనే జరుగుతున్న సమావేశమని బహిరంగ సభ కాదని ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా వేదికగా స్పష్టం చేశారు.

