Home Page SliderTelangana

ముదిరాజ్‌లకు బీసీ-ఏ రిజర్వేషన్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు

Share with

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత తమ జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని… నాటికీ, నేటికీ ఎలాంటి మార్పు లేదంటూ వాపోతున్నారు రాష్ట్రంలో ముదిరాజ్ కులస్తులు. మొన్న జరిగిన కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలలో 124 మార్కులు వచ్చినా కూడా నారాయణ పేట్ జిల్లాలోని బాపన్‌పల్లికి చెందిన ముదిరాజ్ యువకుడు ఉదయ్ కుమార్‌కు రాని ఉద్యోగం 95 మార్కులు మాత్రమే వచ్చిన రెడ్డి అభ్యర్థికి వచ్చిందని, ఇదెక్కడి అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముదిరాజ్‌లకు కూడా బీసీ-ఏ రిజర్వేషన్ ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని వాదిస్తున్నారు. ఈ డబ్ల్యూయస్ ( అగ్రవర్ణ రిజర్వేషన్స్) వల్ల ముదిరాజ్‌లకు అన్యాయం జరుగుతోందని ముదిరాజ్ యువత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే ఎప్పటికీ ముదిరాజ్ వర్గం వారికి ప్రభుత్వ ఉద్యోగాలు అందని ద్రాక్షే అని వాపోతున్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్ర్రక్రియలో EWS రిజర్వేషన్లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆదిలాబాద్ జిల్లాలో కటాఫ్ మార్కులు 94 కాగా బీసీ-డిలకు 119, ఎస్టీలకు 113 ఉంది. దీనిపై కొన్ని కులాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు, 9 శాతం ఉన్న అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయమని ఆర్థికంగా వెనుకబడి ఉన్నామని కోరుతున్నారు.

ఎన్నికల సమయంలో కేసీఆర్ వాగ్దానాలివ్వడానికి మాత్రమే పరిమితమవుతున్నారని… ఆచరణలో మాత్రం ఎలాంటి ఫలితం ఉండటం లేదంటున్నారు. తెలంగాణ అంతటా పెద్ద సంఖ్యలో ఉన్న ముదిరాజ్‌లో రాష్ట్రంలోని సగానికి పైగా నియోజకవర్గాల్లో ప్రబలంగా ఉన్నారు. గ్రేటర్ హైదారాబాద్‌తో సహా, పలు జిల్లాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే శక్తి ఉన్నప్పటికీ కేవలం ఓటు బ్యాంక్‌గానే వాడుకుని.. ఎన్నికల తర్వాత పట్టించుకోవడం లేదని ముదిరాజ్ హక్కుల ప్రతినిధులు దుయ్యబడుతున్నారు. ముదిరాజ్ బిడ్డలకు మేలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామంటున్నారు. ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందించడం కుల సంఘం నాయకులు మండిపడుతున్నారు. కనీసం నాయకులను పిలిచి మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత రావాల్సిన ప్రయోజనాలు ఏవీ కూడా ముదిరాజ్ బిడ్డలకు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా రిజర్వేషన్ వర్తించే వరకూ పోరాటం చేస్తామని, తమ డిమాండ్లు తీర్చేవరకూ నిద్రపోయేది లేదని సవాల్ చేస్తున్నారు.

మనదేశంలో స్వాతంత్య్రం లభించిన నాటినుండి మొక్కగా మొదలైన రిజర్వేషన్ విషవృక్షం నెమ్మదిగా వేళ్లూనూకుంటూ బలంగా భూమిలో పాతుకుపోయింది. శాఖోపశాఖలుగా విస్తరిస్తూ కులాలు, జాతులు, వర్గాల పేరుతో రిజర్వేషన్లను పెంచుకుంటూ పోతోంది. రాజకీయనాయకులు వారి ఓటుబ్యాంకు కోసం రిజర్వేషన్లను కొనసాగిస్తూ ప్రాంతాల వారీగా, జాతులు, కులాల వారీగా ప్రభుత్వోద్యోగాలు, స్కూల్, కాలేజి సీట్లు, చట్టసభలలో సీట్లతో పెంచుకుంటూ పోతున్నారు. దీనితో కొన్ని వర్గాల వారికి అన్యాయం జరుగుతూనే ఉంది. కొందరు రిజర్వేషన్ల కోసం పోరాడుతూనే ఉన్నారు. చివరికి ఈ రిజర్వేషన్ల పిచ్చి ఎంతవరకూ వెళ్లిందంటే భారత ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో  హింస పెచ్చు పెరిగి మహిళలపై అఘాయిత్యాలు చేసే స్థితికి చేరింది. అక్కడి మహిళలపై జరిగిన అమానుషచర్యతో దేశం మొత్తం విస్తుపోయింది. ప్రపంచ వ్యాప్తంగా భారత్ పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఇంత హింస జరుగుతున్నా రిజర్వేషన్లను రద్దు చేసే ఆలోచనలు చేయడం లేదు ప్రభుత్వాలు. ఈ పరిస్థితి మారి భారత్ అంతటా ఒకే చట్టం, ఒకే న్యాయం, జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాతులు, కులాల మధ్య కుమ్ములాటలతో అంతర్గత కలహాలను ప్రోత్సహించడానికే రిజర్వేషన్లు చాలా వరకూ ఉపయోగపడుతున్నాయి.