2014 కూటమి మళ్ళీ కలవాలన్నదే మా ఆకాంక్ష : పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ ఇప్పటికీ ఎన్డీఏలోనే కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇటీవల ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరయ్యానని మళ్లీ 2014లో రాష్ట్రం కోసం పనిచేసిన కూటమి 2024 లోను పనిచేయాలనేది తన ఆకాంక్ష అని అన్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధికి దూరమై అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని మళ్లీ అత్యున్నతంగా తీర్చిదిద్దాలంటే మూడు పక్షాలు కలిసి పోరాడాలని కేంద్ర పెద్దలను కోరినట్లు చెప్పారు. ప్రజలే మాకు మొదటి ప్రాధాన్యమని వారి శ్రేయస్సు దృష్ట్యా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కోసం అంతా కలిసి వస్తారని నమ్మకం ఇప్పటికీ ఉందన్నారు. ప్రజల్లో చూస్తున్న స్పందన చూస్తుంటే కచ్చితంగా వారికి జనసేన తెలుగుదేశం కూటమి పై ఓ భరోసా ఏర్పడిందన్నారు. జనసేన పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలి ఎక్కడ పోటీ చేయాలి ఎన్ని స్థానాల్లో బరిలో నిలవాలనేది తమ సొంత విషయం అని పొత్తులపై వైఎస్ఆర్సీపీకి చెప్పాల్సిన అవసరం తమకు లేదని నేరుగా ప్రజలకు చెబుతానని అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు తమ గురించి మాట్లాడే కంటే ముందు రాష్ట్ర క్షేమం గురించి మాట్లాడాలని అన్నారు.