జగన్ చెప్పడానికి ఏముంది?
వైసీపీ ప్లీనరీ సమవేశాలు గత కొద్ది రోజులుగా జిల్లాల వారీగా జరుగుతున్నాయ్. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా… లేదంటే ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా అంటూ ప్రజాప్రతినిధలు.. గడపగడపకు ప్రభుత్వమంటూ కార్యక్రమాలు నిర్వహించారు. గడప గడపకు వెళ్లి… ప్రజల సాదకబాధకాలు తెలుసుకున్నారు. గ్రామ సచివాలయాల ద్వారా అందిస్తున్న సేవలను వివిధ పథకాలను ప్రజలకు వివరించారు ఎమ్మెల్యేలు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లి… 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. 151 స్థానాల్లో జయభేరి మోగించారు. అంతకు ముందు సుదీర్ఘపాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువయ్యాడు. 3648 కిలో మీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని నవరత్నాలతో పేద ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నారు.

కరోనా కాటేసినా… ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా.. ప్రభుత్వం మాత్రం సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ వస్తోంది. మూడేళ్లుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల కష్టసుఖాల్లో సర్కారు భాగస్వామిగా నిలిచింది. ఐతే ఎమ్మెల్యేలు చేస్తున్న దందాలు, లాలూచీలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వైసీపీ విమర్శలపాలవుతోంది. ఓవైపు అధినేత ప్రజలకు చేరువయ్యేలా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే… మరోవైపు ఎమ్మెల్యేలు కమిషన్లు, లాలూచీలతో కక్కుర్తి రాజకీయాలు చేస్తూ ప్రజల నుంచి విముఖత ఎదుర్కొంటున్నారు. నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యుడు సతమతమవుతున్నాడు. ఓవైపు పెట్రో భారం, మరోవైపు నిత్యవసరాల ధరలు సామాన్యుడిపై దండెత్తుతున్న తరుణంలో ఓటరు ఈసారి ఎలా రియాక్ట్ అవుతాడోనన్న టెన్షన్ వైసీపీని వెంటాడుతోంది. విద్యుత్ కోతలతో జనం అల్లాడిపోతున్నారు. ఇక అభివృద్ధి అన్న మాట కన్పించదు, విన్పించదు. మద్యం వల్ల పెరుగుతున్న ఘోరాలు అన్నీ ఇన్నీ కావు. ఆర్టీసీ ఛార్జీల పెంపు… మొత్తంగా సామాన్యుడ్ని అన్ని వైపులా బాధేస్తోంది జగన్ సర్కారు. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్లీనరీ వేదికగా ప్రజలకు ఇచ్చే భరోసా ఏంటన్నదానిపై అటు పార్టీలోనూ, ఇటు సామన్యుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.