ప్లీనరీకి విజయమ్మ హాజరవుతారన్న విజయసాయి
పార్టీ ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న మూడో ప్లీనరీని ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నామన్నారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. గత రెండు ప్లీనరీలు ప్రతిపక్షంలో ఉండగా జరిగితే.. ఈసారి అధికార పక్షంగా మూడేళ్ళ పాలన తర్వాత జరుగుతున్న ప్లీనరీ అని చెప్పుకొచ్చారు. ప్లీనరీ కోసం జులై 8న మొదటిరోజు సుమారు లక్షా 50వేలమంది వస్తారని… రెండోరోజు 4 లక్షల మంది హాజరు అవుతారన్నారని అంచనా వేస్తున్నామన్నారు విజయసాయిరెడ్డి. ప్లీనరీ విజయంవంతం కానుండటంతో చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ పరాకాష్టకు చేరిందన్నారు. 14ఏళ్లు అధికారంలో ఉన్నన్నాళ్ళు, ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు, ఇప్పుడు తాను చేసిన కార్యక్రమాలు ఇవీ.. అని చెప్పకుండా తెల్లారిలేస్తే, విమర్శల మీదే బతుకుతున్నాడన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిలుపుదల చేయాలనే దురుద్దేశ్యంతో, చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 8 వేల గ్రామాల్లో స్కూళ్లను మూసేశారని పచ్చి అబద్దం చెబుతున్నాడని విమర్శించారు విజయసాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల వద్దకే ప్రభుత్వం అనే సిద్ధాంతంతో ముందుకు వెళుతున్నామన్నారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేయలేకపోయారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్లలోనే చేసి చూపించారన్నారు విజయసాయిరెడ్డి. మూడేళ్లలో దళారులు, మధ్యవర్తులు లేకుండా ప్రజలకు నేరుగా 1.6 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నగదును అందించిన ఘనత వైసీపీ సర్కారుదేనన్నారు. జగన్ పరిపాలనకు గీటురాయిగా ప్లీనరీ జరుగుతోందన్నారు. ప్లీనరీలో పెట్టే భోజనాల విషయంలో కూడా టీడీపీ, చంద్రబాబు అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారన్నారు. 25 రకాల వంటకాలతో భోజన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మేమేదో ప్లీనరీలో పంది మాంసం పెడుతున్నామని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని విజసాయి విమర్శించారు. ప్లీనరీకి పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హాజరు అవుతారన్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై మొదటి రోజు తీర్మానం ప్రతిపాదిస్తామన్నారు. 2024 ఏప్రిల్‌లో ఎలాగూ ఎన్నికలు వెళ్లాల్సిందే. ముందస్తు ఎన్నికలకు తొందరెందుకంటూ దుయ్యబట్టారు. ముందస్తు ఎన్నికలు వస్తే ముఖ్యమంత్రి అవుతానని చంద్రబాబు నాయుడు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.