Andhra PradeshNews

విజయమ్మ ఎవరి వైపు? కొడుకా.. కూతురా ?

Share with

విజయమ్మ ఎవరి వైపు? కొడుకా.. కూతురా ?

◆ ప్లీనరీకి వస్తారా రారా?
◆ కుటుంబంలో విభేదాలు!
◆ విజయమ్మ ప్లీనరికి హాజరుపై వైసీపీలో దీమా
◆ హాజరవుతారంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి

వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ ఈ నెల 8, 9 తేదీల్లో జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆ పార్టీ నేతలు భారీగా చేస్తున్నారు. ప్లీనరీలో ఈ సారి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి పాల్గొంటారా లేదా అన్న సందేహం వైసీపీ నేతల్లోనే కాదు… ఇతర రాజకీయ పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది. ప్లీనరీ సమావేశాలకు హాజరై కొడుకుకి అండగా నిలబడతారా లేదా కూతురు షర్మిల మాటలకు లొంగి హాజరు కారా అనే వార్త ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనికి కారణం కొంత కాలంగా వైఎస్ విజయమ్మ వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయమ్మ వైసీపీ ప్లీనరీకి వస్తారా రారా అనే చర్చ జోరుగా సాగుతోంది.

ఇటీవలి పరిణామాలతో విజయమ్మ వైసీపీ పదవికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. జగన్ కు ఇష్టం లేకుండా షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయటంతో ఇద్దరికీ పడటం లేదనే వార్తలు అప్పట్లో బాగా చక్కర్లు కొట్టాయి. దీనితోపాటు కుటుంబ సమస్యల కారణంగా విజయమ్మ ప్లీనరీ సమావేశాలకు వస్తారా..? రారా..? అనేది అనుమానం కలుగుతోంది. ఐతే ప్లీనరీకి విజయమ్మ వస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. మారుతున్న సమీకరణాల నేపథ్యంలో జగన్‌ను శాశ్వత అధ్యక్షుడిగా ప్రతిపాదించి… వైసీపీ బైలాస్‌లో సవరణ చేసే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఒకవేళ విజయమ్మ ప్లీనరీకి రాకపోతే ఆమె వైసీపీతో తెగదెంపులు చేసుకున్నారనే సంకేతాలు పార్టీ శ్రేణులకు, జనాల్లోకి వెళ్తాయన్న ఉత్కంఠ పార్టీలో ఉంది. అదే జరిగితే వైసీపీకి నష్టం చేకూరటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.