Andhra PradeshNews

కుప్పంలో చంద్రబాబుకు పెద్దిరెడ్డి ఝలక్

Share with

◆ గుడిపల్లి మండలంలో టీడీపీకి బై బై చెప్పిన 100 మంది నాయకులు, కార్యకర్తలు
◆ చంద్రబాబుకు రాజకీయంగా ప్రమాదఘంటికలు
◆ ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం గెలుస్తారా ?
◆ పక్కా వ్యూహాం అమలు చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కొత్త తలనొప్పులు తప్పేలా లేవు. గత సంవత్సరంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఆయనకు షాక్ ఇచ్చాయి. ముఖ్యంగా తన సొంత నియోజకర్గంలో అధికార పార్టీ విజయంతో భవిష్యత్‌పై రాజకీయంగా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వైసీపీ అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాగా వేయడంతో.. 2024 ఎన్నికలకు ముందే డేంజర్ బెల్ లా మారింది. మరి వచ్చే ఎన్నికల్లో బాబు కుప్పం నుంచి గట్టెక్కేనా…. డీలా పడేనా అన్నది ఆసక్తిగా మారింది.1989 నుంచి ఎమ్మెల్యేగా చంద్రబాబు ఓటమి లేకుండా ఆ నియోజకవర్గంలో వరుసగా ఆరు సార్లు గెలిచారు. ఏడోసారి ఓట్ల శాతం తగ్గిందనే చెప్పుకోవాలి. చంద్రబాబు కుప్పంకు వెళ్లకపోయినా నామినేషన్ ఆయన పేరుతో వేరే వారు వేసినా విజయం మాత్రం ఆయనదే. చంద్రబాబుపై ఎంతో నమ్మకం ఉన్న కుప్పం ప్రజలు ఎమ్మెల్యేగా బాబుని తప్ప మరెవ్వరిని గెలిపించే వారు కాదు.

కానీ 2019 ఎన్నికల తరువాత జరుగుతున్న పరిణామాలు చంద్రబాబుకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆది నుంచి ఆధిక్యం ప్రదర్శించే చంద్రబాబు.. గత ఎన్నికల్లో మాత్రం మొదటి రెండు రౌండ్లలో వెనుకంజలోకి వెళ్లడం అప్పట్లో సంచలనంగా మారింది. సార్వత్రిక ఎన్నికల తరువాత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. కుప్పంలోని 89 పంచాయితీల్లో పోటీ చేసిన టీడీపీ కేవలం 14 స్థానాల్లోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అధికార వైసీపీ పార్టీ తన సత్త చాటి 74 పంచాయితీలను కైవసం చేసుకుంది. దీంతో గట్టి షాక్ తిన్న బాబు.. అప్పట్లో హడవుడిగా మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించారు. అక్కడే మకాం వేసి… పార్టీ కార్యకర్తలు….గ్రామా స్థాయి నేతల నుంచి నియోజకవర్గ నేతల వరకు పేరుపేరునా పలకరించారు. కొంతమేర పార్టీ పునాదులను గట్టిపరిచారు.

కానీ చిత్తూరు జిల్లాలో టీడీపీ పార్టీ లేకుండా చేయాలనే సంకల్పంతో అధికార వైసీపీ పార్టీ కంకణం కట్టుకుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో అక్కడ వైసీపీ శ్రేణులు పక్కాగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కుప్పంలో చంద్రబాబుకు స్థానం లేకుండా చేయాలనే లక్ష్యంతో పెద్దిరెడ్డి నిరంతరం కార్యాచరణ రూపొందిస్తున్నారు. తాజాగా మంగళవారం చంద్రబాబు నియోజకవర్గం లోని గుడిపల్లి మండలంలోని వందమంది నేతలు కార్యకర్తలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కుప్పంలో టీడీపీకి షాక్ తగిలిందని పలువురు విశ్లేషిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింతమంది వైసీపీలో చేరబోతున్నారని రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడం తథ్యమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మరి ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు నియోజకవర్గం మారతారా అక్కడే పోటీ చేస్తే గట్టెక్కుతారా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా మారింది.