బాబు బంగారం అంటున్న విజయమ్మ
నేడు మంగళగిరి సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటి వద్ద జరుగుతున్న ప్లీనరీ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, విజయమ్మ హాజరయ్యరు. మహానేత వైఎస్‌ఆర్ 73వ జయంతి నిర్వహిస్తున్న ప్లీనరీలో విజయమ్మ తనయుడు జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికెత్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు ఎన్నో సేవలు చేస్తే… తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రికి తగ్గ తనయుడులా సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు సేవలు అందిస్తున్నారన్నారు. ఆనాడు అధికార శక్తులన్నీ విరుచుకు పడ్డా, కేసులు పెట్టి వేధించిన వైఎస్ జగన్ ఓర్పుతో ఎంతో ఎత్తుకు ఎదిగారన్నారు. ప్రజల ప్రేమను సంపాదించిన బిడ్డను చూసి గర్వంగా ఉందన్నారు. మీ అందరి ఆశీస్సులు జగన్ పై ఉండాలని కోరుకుంటున్నానన్నారు. జగన్ చెప్పిన పథకాలు అన్ని బాధ్యతగా నిర్వహిస్తూ చెప్పని పథకాలను అమలు చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్ అమ్మ ఒడి, రైతు భరోసా, గ్రామ సచివాలయాలు, పేదలకు ఇళ్ళ పంపిణిలాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. చివరగా ప్రజలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యరు.