పార్టీ బలోపేతానికి వైఎస్ జగన్ ప్రణాళికలు
◆ పరిపాలనతో పాటు పార్టీపై పూర్తి దృష్టి
◆ నియోజకవర్గాల వారీగా నివేదికలు
◆ పార్టీ కోసం పని చేయని వారిని సున్నితంగా మందలింపు
◆ త్వరలో నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశం
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ పాలనపైనే దృష్టిపెట్టారు. సంక్షేమ పథకాలు, నిధుల సమీకరణ, కొత్త పథకాల ప్రారంభం వంటి వాటికే తన సమయాన్నంతా కేటాయిస్తున్నారు. గత మూడేళ్లగా ఆయన పార్టీని పట్టించుకోలేదనే మాట కూడా బాగా వినిపించింది. దీంతో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతానికి ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ బాస్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇక నుండి ప్రభుత్వ పరిపాలన అంశాలతో పాటు పార్టీ కోసం కూడా ఎక్కువ సమయం గడపాలని జగన్ యోచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వేగంగా చేర వేస్తున్న వైఎస్ జగన్ తాజాగా పార్టీ పరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గడిచిన 20 రోజులుగా ఆయా జిల్లాల్లోని పార్టీ నేతలతో పనితీరు పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటూ వేగంగా ముందుకు వెళ్తున్నారు. పార్టీ నిర్వహించిన ప్లీనరీ తర్వాత జగన్‌లో మంచి జోష్ పెరిగిందని పార్టీ పరమైన నిర్ణయాలు కూడా వేగంగా తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై కూడా వైఎస్ జగన్ పూర్తిగా దృష్టి సారించి ప్రతి రోజు జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకొని స్వయంగా పరిశీలిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కొంత మంది నేతలను కూడా సున్నితంగా మందలిస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ప్రజల్లో తమ పార్టీపై ఉన్న విశ్వాసం పట్ల కూడా వివిధ సర్వే ఏజెన్సీల ద్వారా ఇంటిలిజెన్స్ ద్వారా రిపోర్టులు తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎవరు పనిచేస్తున్నారు. ఎవరు పనిచేయడం లేదని… సమాచారాన్ని కూడా ఆయన తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. మరింత పార్టీ బలోపేతం కోసం నియోజకవర్గానికి 50 మంది కార్యకర్తలతో త్వరలోనే ఆయన సమావేశం కాబోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పార్టీ అభివృద్ధిని అందరూ కలిసికట్టుగా మరింతగా పెంచే విధంగా ఆయన ఫోకస్ పెట్టినట్లు సమాచారం. పార్టీ అభివృద్ధిపై ఫోకస్, సంక్షేమ కార్యక్రమాల అమలుపై శ్రద్ధ మొత్తంగా… ముందస్తు ఎన్నికలు జరిగుతాయన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయ్. గడిచిన మూడు సంవత్సరాలుగా నిస్తేజంలో ఉన్న పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపి జగన్ సక్సెస్ అవుతారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.