ఏపీలో ఘనంగా పింగళి వెంకయ్య 146వ జయంతి వేడుకలు
నేడు జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి. ఈ సందర్భంగా ఆయన జయంతి వేడుకలను ఏపీ సీఎం జగన్ ఘనంగా ప్రారంభించారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అదే విధంగా పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్ ప్రారంభించారు.
భారతదేశానికి సంబంధించిన త్రివర్ణ పతాకాన్ని ఎంతో చక్కగా ,అందంగా రూపొందించారు పింగళి వెంకయ్య. పింగళి కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రు గ్రామంలో జన్మించారు. ఈ వేడుకలను భట్ల పెనుమర్రు గ్రామంలో మంత్రి జోగి రమేష్ ప్రారంభించారు. అలాగే చిత్తూరు జిల్లా నగరిలో నిర్వహించిన పింగళి జయంతి వేడుకల్లో మంత్రి రోజా పాల్గొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. మరోవైపు పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకొని తపాలా శాఖ ఆయనపై రూపొందించిన ప్రత్యేక కవర్‌ను నేడు ఆవిష్కరించింది.