సీనియర్లకు ఈసారి టికెట్లివ్వనంటున్న జగన్ (మన సర్కార్ ఎక్స్‌క్లూజివ్)
దేశంలో ప్రతీ పార్టీలోనూ ఉన్న సమస్యే ఆంధ్రప్రదేశ్ వైసీపీ పార్టీ ఎదుర్కొంటుంది. వైసీపీలో చూస్తే సీనియర్లు తన తండ్రి వైఎస్సార్‌తో కలసి అడుగులు వేసిన వారితో అంత కలుపుగోలుగా జగన్ ఉండలేకపోతున్నారని టాక్. ఈ సారి సగంపైన యువతకు సీట్లు కేటాయించి, సీనియర్లకు వారి ప్రతిభ ఆధారంగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు లేదంటే నామినేటెడ్ పదవులు ఇచ్చి సంతృప్తి పరచాలని జగన్ యోచిస్తున్నారు. అంతగా చదువు సంద్యలు లేని వారిని పక్కనబెట్టి… వారి కుటుంబ సభ్యులు, వారు చెప్పిన వారికి గానీ వైసీపీ టికెట్లు కేటాయిస్తారని గుసగుసలు వినపడుతున్నాయి. దేశంలో రాహుల్ గాంధీ కొత్త నెత్తురు కావాలని ఏకంగా అధ్యక్ష పీఠాన్నే అలిగి వదిలేశారు. టీడీపీలో లోకేష్ సైతం అదే ఆలోచనలో ఉన్నారు. యంగ్ స్టర్స్ తోనే ప్రయాణమని ఒట్టేసుకుంటున్నాడు. ప్రస్తుతం వైఎస్ జగన్ సైతం అదే ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం.
సీనియర్లు వయసుల రీత్యా అనుభవం కారణంగా వారికి విలువ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటపుడు తాను అనుకున్నది సాగదు. ఇటీవల మలివిడత మంత్రివర్గ విస్తరణలో సైతం యంగ్ క్యాబినేట్ అని జగన్ అన్నారు. కొత్తవారితోనే అంతా నింపాలని చూశారు. కానీ తీరా ఆచరణలో మాత్రం అందరినీ తీసుకోవాల్సి వచ్చింది. అలా చేయడం ఇష్టం లేకున్నా… అనివార్యంగా నిర్ణయం మార్చుకోవాల్సి వస్తోందట. ఇలా చేయడం వల్ల అసలు లక్ష్యం దెబ్బతింటుందని జగన్ మధనం పడుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈసారికి ఇలా అయింది గానీ… వచ్చే ఎన్నికల తరువాత అంతా జూనియర్లు యంగ్ బ్లడ్ తోనే కథ నడపించాలని జగన్ పక్కాగా డిసైడ్ అయ్యారని టాక్. దాని కోసం ఇప్పటి నుంచే తీసివేతలు మొదలుపెట్టారట. ఈసారి జరిగే ప్లీనరీలో సీనియర్లకు కొన్ని షాకులు ఇచ్చే సూచనలున్నాయట. వచ్చే ఎన్నికల్లో సీనియర్లను పార్టీకి మాత్రమే ఉపయోగించుకొని ప్రత్యక్ష రాజకీయల నుంచి తప్పిస్తారని పార్టీ వర్గాల ఉవాచ.
సీనియర్లకు ఈ విషయంలో కొన్ని ఆప్షన్లు కూడా ఇస్తారని టాక్ నడుస్తోంది. అదేంటి అంటే మీరు పోటీ చేయకపోయినా మీ వారసులకు కచ్చితంగా టికెట్ ఇస్తామని వారి వెనక మీరు ఉండి గెలిపించండని జగన్ చెబుతారట. ఇక సీనియర్లకు పార్టీలో పెద్ద పీట వేయడమే కాకుండా రాజ్యసభ మెంబర్స్‌గా, ఎమ్మెల్సీలుగా కూడా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అయితే పెద్ద మనుషులుగా అక్కడ ఉండాల్సిందే తప్ప మంత్రి పదవులు వగైరాల మీద అసలు ఆశలేవీ పెట్టుకోకూడదన్నది జగన్ ఇస్తున్న సందేశం. ఇదిలా ఉంటే సీనియర్ల జాబితా ఒకటి వైసీపీలో చక్కర్లు కొడుతోంది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు బూడి ముత్యాలనాయుడు, పినిపే విశ్వరూప్, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావులతోపాటు… స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, రంగనాధరాజు, కరణం బలరాం, అనంత వెంకట్రామిరెడ్డి లాంటి వారికి ఓ దండం పెట్టడం ఖాయమని పార్టీ నేతలు అంటున్నారు. వీరిలో ఆనం రామనారాయణరెడ్డి తన దారి ఇప్పటికే చూసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గం నుంది నేదురుమల్లి జనార్దనరెడ్డి తనయుడు రాం కుమార్ రెడ్డిని ఈసారి పోటీలో ఉంచాలని పార్టీ భావిస్తోంది.
అలాగే మంత్రులలో కొందరు ఇప్పటికే తమ రిటైర్మెంట్ మీద ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చేశారట. ఈ మధ్యనే చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగిన వైసీపీ ప్లీనరీలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎల్లకాలం మనమే నాయకత్వం చేయాలంటే కుదిరే పనేనా అని ఒకింత వైరాగ్యంతో మాట్లాడారు. ఆయన కుమారుడు బొత్స సందీప్ ఈసారి పోటీ చేస్తారని టాక్ ఉంది. ఇక బూడి ముత్యాలనాయుడు కుమార్తె ఇప్పటికే మాడుగులలో రాజకీయంగా యాక్టివ్‌గా ఉన్నారు. ఇక పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి కొడుకు మిధున్ రెడ్డి ఉన్నారు. ఈసారి ఆయన అసెంబ్లీకి వస్తారని అంటున్నారు. ఈ మధ్యనే నారాయణస్వామి కూతురు లక్ష్మి వైసీపీ పెద్దలను కలసి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నుంచి ఆమె బరిలో ఉంటారు సమాచారం. ఇక మిగిలిన వారి కుటుంబాలలో వారసులు ఉంటే… వారు సమర్ధులైతే వారికే కచ్చితంగా టికెట్ ఇవ్వడానికి వైసీపీ సిద్ధంగా ఉందట. ప్లీనరీ వేదికగా ఆ విషయాలను సీనియర్ల చెవిన వేసి వారి వారసులకు రెండేళ్లు ముందుగానే టికెట్లు ప్రకటించాలన్న జగన్ ముందస్తు ఆలోచనలో ఉన్నారట. తండ్రులు అధికారంలో ఉండగానే వారసులు జనంలో ఇప్పటి నుంచే తిరిగితే ఎన్నికలలో విజయం సులువు అవుతుందని వైసీపీ వ్యూహం రచిస్తోంది. మరి సీఎం జగన్ వ్యూహాన్ని సీనియర్లు ఏ మేరకు తీసుకుంటారన్నది చూడాలి. సీనియర్లు బలవంతపు రిటైర్మెంట్‌కి ఒప్పుకుంటారా లేక వేరే మార్గాలు చూసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది.