చంద్రబాబు నోట మళ్లీ మళ్లీ జైతెలంగాణ
మా బతుకు ,జీవితం తెలంగాణాలోనే అని అంటున్నారు విలీన గ్రామాల ప్రజలు. జగన్ సర్కార్ తమను గాలికి వదిలేసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాబట్టి మమ్మల్ని తెలంగాణాలోనే కలపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ఏపీలోని అల్లూరి జిల్లా యటపాక మండలంలోని ఐదు గ్రామ పంచాయితీల ప్రజలు దీని కోసం రాస్తారోకోలు,ధర్నాలు నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో వారు చెన్నపేట వద్ద రాస్తారోకో,వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.అయితే దీనికి ఏపీ పోలీసులు అనుమతించలేదు.గోదావరి వరద వస్తున్న క్రమంలో ఇటువంటి వాటికి అనుమతులు లేవని వారు సూచించారు.అదే విధంగా ఆంక్షలు పాటించని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.దీంతో వారు రాజుపేట వద్ద రాస్తారోకో నిర్వహించారు.ఈ రాస్తారోకోకు ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు మద్దతు తెలిపారు.ఈ రాస్తారోకో ను పురస్కరించుకొని ఏపీ పోలీసులు భారీగా మోహరించగా తెలంగాణ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఈ రాస్తారోకోపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. విలీన గ్రామాల ప్రజలు జగన్ పై అపనమ్మకంతోనే తమను తెలంగాణాలో కలపాలని కోరుకుంటున్నారని తెలిపారు. గత 2 వారాలుగా ఆ వరద ప్రభావిత ప్రాంతాలలో కరెంటు సరఫరా నిలిచి పోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అయితే ఇప్పటివరకు ఆ ప్రాంతాలలోని వరద బాధితులకు తక్షణ సహాయం అందించడంలోనూ… జగన్ ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. అందుకే ఎటపాక ప్రజలు తమ గ్రామాలను తెలంగాణాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలపై ఎదురు దాడి చేయడం, అనవసరంగా కేసులు పెట్టడం మాని ప్రజలను పట్టించుకోవాలని జగన్ ప్రభుత్వానికి సూచించారు. విపక్షాలపై విరుచుకుపడే అధికార పార్టీ మంత్రులు వారం క్రితమే వరదలు తగ్గాయని ప్రకటించారు. అయినప్పటికీ ఎందుకు ఇప్పటివరకూ.. విద్యుత్తు సరఫరాను,రోడ్లను పునరుద్ధరించలేదో తెలపాలన్నారు. వరదలకు చనిపోయిన పశు కళేబరాలతో, ఇళ్ళల్లో విషసర్పాలతో, దోమలు ,పురుగులతో ప్రజలు పడుతున్న అవస్థలను ప్రభుత్వం గుర్తించాలన్నారు. ప్రభుత్వ పెద్దలు గాలిలో పర్యటనలు, గాలి మాటలు పక్కన పెట్టి ,తక్షణమే యుద్దప్రాతిపదికన వరద ప్రాంతాల ప్రజల సమస్యలు తీర్చాలని చంద్రబాబు ట్వీట్ చేశారు.