Andhra PradeshNews

వైసీపీ యువనేత హత్య.. సింగరాయకొండలో ఉద్రిక్తత

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సింగరాయకొండ మండలం మూలగుంటపాడుకు చెందిన పసుపులేటి రవితేజ తన స్నేహితుడు ఉమతో కలిసి గురువారం రాత్రి వేర్వేరు బైక్‌లపై వెళ్తుండగా లారీ వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. రోడ్డుపై పడిపోయిన రవితేజను తొక్కుకుంటూ లారీ వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో రవితేజ అక్కడికక్కడే చనిపోయాడు. లారీని ఆపేందుకు ప్రయత్నించగా.. తనపైకి కూడా లారీని నడిపించేందుకు డ్రైవర్‌ ప్రయత్నించాడని రవితేజ స్నేహితుడు ఉమ చెప్పాడు.

ప్రమాదం కాదు.. హత్యే..

రవితేజ ప్రకాశం జిల్లా సోమరాజుపల్లి మాజీ సర్పంచ్‌ పసుపులేటి శ్రీనివాసరావు కుమారుడు. తన కుమారుడిది ప్రమాదం కాదని, పక్కా హత్యేనని శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు. సింగరాయకొండ ఎంపీపీ పదవిపై తలెత్తిన వివాదమే ఈ హత్యకు కారణమని స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎంపీపీ పదవి కోసం ఇద్దరు వైసీపీ నేతలు ప్రయత్నించారు. రవితేజ ఓ వర్గానికి అనూకూలంగా వ్యవహరించడంతో మరో వర్గం వారు ఇతనిపై పగ పెంచుకున్నారు. రెండు వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకొని పోలీస్‌ స్టేషన్‌లో కేసులు కూడా పెట్టుకున్నారు. ఇద్దరూ ఒకే పార్టీ వారు కావడంతో రాజీ సైతం కుదుర్చుకున్నారు. ఆ కక్షతోనే ప్రత్యర్థి వర్గం వారు రవితేజను లారీతో ఢీ కొట్టి చంపేశారని స్థానికులు చెప్పుకుంటున్నారు.

లారీకి నిప్పు

రవితేజను ఢీకొట్టిన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే.. శుక్రవారం ఉదయం సింగరాయకొండ పోలీసు స్టేషన్‌ గోడ దూకి లోపలికి వెళ్లిన కొందరు ఆందోళనకారులు అక్కడ ఉన్న లారీకి నిప్పటించారు. పోలీసులు వెంటనే మంటలను ఆర్పేశారు. ఆందోళనకారులు పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న చలివేంద్రాన్ని సైతం తగులబెట్టారు. రవితేజ హత్యకు నిరసనగా పట్టణంలో షాపుల్ని మూసివేయించారు. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో ఒంగోలు నుంచి అదనపు పోలీసులను రప్పించి పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.