రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యం
•అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకు వెళ్లాలి.
•కృష్ణా,గుంటూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ లు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్
ఏపీలో రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని గుంటూరు, కృష్ణా జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ లు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ లు పేర్కొన్నారు. నగరంలోని తెనాలి రోడ్డు మార్కండేయ పద్మశాలీయ కళ్యాణ మండపంలో ఆదివారం మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ విస్తృతస్థాయి సమావేశం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. తొలుత దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం జరిగిన సమావేశంలో రీజనల్ కో ఆర్డినేటర్ లు అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ లు మాట్లాడుతూ… దేశంలో ఇప్పటి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారని, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్‌లా పరిపాలన ఎవరూ చేయలేదన్నారు. మూడున్నరేళ్లలోనే ఏకంగా 98.44 శాతం హామీలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌దేనని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండేళ్లు కరోనాతో సరిపోయిందని, ఆ సమయంలో కూడా సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపలేదని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు చెబితే ఆరోగ్యశ్రీ గుర్తుకు వస్తుందని, జగన్ పేరు చెబితే నవరత్నాలు గుర్తుకు వస్తాయన్నారు. రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని, సీఎం జగన్‌ను ప్రతి ఒక్కరూ ఆదరించి..ఆశీర్వదించాలని కోరారు. నియోజకవర్గ పరిశీలకులు నిమ్మకాయల రాజ నారాయణ మాట్లాడుతూ నీతి, నిజాయితీలతో నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటు పడుతున్న ఎమ్మెల్యేని 2024 ఎన్నికల్లో ముచ్చటగా మూడవ సారి విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాబోతున్నారన్నారు. నియోజకవర్గం లో వందల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మాటలకంటే తన చేతలతో దూసుకుపోతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే విజయం కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత మూడున్నరేళ్లలో నియోజకవర్గం ప్రజలకు రూ.800 కోట్ల సంక్షేమ పథకాలను అందించామన్నారు. రూ.300 కోట్లతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు సాధించి మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మూడు శాఖలు మంత్రిగా పని చేసిన ఆయన తనయుడు లోకేష్ లు నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్నా అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. లోకేష్ నాలుగు వేల కిలో మీటర్లు కాదు కదా 40వేల కిలోమీటర్లు పొర్లు దండాలు పెట్టినా రాష్ట్రంలో టీడీపీ ఓటమి తప్పదన్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, పేదల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. పేద, మధ్య తరగతి ప్రజలు మరింత అభివృద్ది చెందాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మరలా సీఎంగా గెలుపించుకోవాలన్నారు. ఈ సందర్భంగా నేతలను… కార్యకర్తలు గజమాలలు వేసి ఘనంగా సత్కరించారు.

