హుజూరాబాద్‌లో ఈటల జైత్రయాత్ర కొనసాగేనా..!?
తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు, హుజూరాబాద్ మరో ఎత్తు అన్నట్టుగా గత రెండేళ్లుగా పరిస్థితులు మారిపోయాయ్. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2గా ఎదిగిన ఈటల రాజేందర్ ను, కేసీఆర్ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడమే కాకుండా.. రాజకీయంగా దెబ్బతీయాలన్న ప్రయత్నాన్ని హూజూరాబాద్ ఓటర్లు ఉపఎన్నికల్లో తిప్పికొట్టారు. కేసీఆర్ కక్ష రాజకీయాలకు బలైన ఈటల ఆ తర్వాత బీజేపీలో చేరి, ఉపఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఈటల ఏడుసార్లు విజయం సాధించారు. ఈటలను ఓడించేందుకు హుజూరాబాద్‌లో దళితబంధు అస్త్రం ప్రయోగించినప్పటికీ కారు పార్టీ చిత్తయ్యింది. మరోసారి ఎన్నికల్లో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తోండగా, కాంగ్రెస్ నుంచి వొడితల ప్రణవ్, బీఆర్ఎస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గత ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో ఈసారి ఆ పార్టీ బలమైన అభ్యర్థిని బరిలో దించింది. అయితే హుజూరాబాద్‌లో వార్ వన్ సైడ్ అన్న భావన, ప్రచారంలో కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. ఇప్పటికే ఈటల రాజేందర్, ఆయన సతీమణి జమున నియోజకవర్గంలో ప్రతి ఓటరును పలకరిస్తూ బీజేపీని ఆశీర్వదించాలని కోరుతున్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం పోలింగ్ బూత్‌లు 305. పురుష ఓటర్లు 1,19,676 మంది కాగా, మహిళా ఓటర్లు 1,24,833 మంది ఉన్నారు. ఐదుగురు ట్రాన్స్ జెండర్లు ఓటు నమోదు చేసుకోగా మొత్తం ఓటర్లు 2,44,514 ఉన్నారు. నియోజకవర్గంలో ఓటర్లలో బీసీల సంఖ్య అత్యధికంగా అంతే సమయంలో ఇక్కడ దళిత ఓటర్లు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇతర బీసీల ఓట్లు 16 శాతానికి పైగా ఉండగా, మాదిగల ఓట్లు 15 శాతం వరకు ఉన్నాయి. రెడ్డి సామాజికవర్గం ఓటర్లు సైతం ఇక్కడ 11 శాతానికి అటూ ఇటూగా ఉన్నారు. మున్నూరు కాపు ఓటర్లు 8 శాతం, గౌడలు 8 శాతం, గొల్ల-కురుమలు 8 శాతానికి దగ్గరగా ఉన్నారు. పద్మశాలీలు 7 శాతానికి పైగా ఉండగా, తెనుగు-మదిరాజ్‌లు 7 శాతానికి చేరువగా ఉన్నారు. మాలలు ఐదున్నర శాతం, విశ్వబ్రహ్మణులు 4 శాతం ఉండగా, ఇతరులు 11 శాతం మేర నియోజకవర్గంలో ఉన్నారు.

