NationalNews

జీఎస్టీతో బద్నాం అవుతోంది కేంద్రం… ఐతే సింహభాగం వాటా రాష్ట్రాలకే…

Share with

ప్రస్తుతం మనదేశంలో ఏ వస్తువు కొనాలన్నా, అమ్మాలన్నా ప్రతి వినియోగదారుడు దాని జీఎస్టీ ఎంత అనే విషయం కూడా గమనిస్తున్నాడు. ఒకదేశం ఒకేపన్ను నినాదంతో  ఈ జీఎస్టీ విధానం మన దేశంలో 2017 జూలై నుంచి అమల్లోకి వచ్చింది. అంతకు పూర్వం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పలు రకాల పన్నుల స్థానంలో జీఎస్టీ విధిస్తున్నారు. వస్తుసేవలపై శ్లాబుల వారీగా పన్నును విధించడం జీఎస్టీతో మొదలుపెట్టారు. వస్తుసేవల పన్నుకు సంబంధించిన రేట్లు, నిబంధనలు, రెగ్యులేషన్లను జీఎస్టీ మండలి చూస్తోంటుంది. ఇందులో కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా ఉంటారు. జీఎస్టీ ఆదాయం కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక ప్రాతిపదికన చేరుతుంది.  కానీ ఏదో జీఎస్టీ ఆదాయం అంతా కేంద్ర ప్రభుత్వానికే పోతున్నట్లు, రాష్ట్రాలకు ఆదాయం లేక అన్యాయం జరుగుతున్నట్లు సోషల్‌ మీడియాలలో  ప్రచారం జరుగుతోంది. వీటిలో నిజానిజాలు తెలుసుకోవాలంటే జీఎస్‌టీ గురించి కూలంకుషంగా చర్చించాలి.

 మన దేశంలోని పరోక్ష పన్నుల విధానంలో వస్తుసేవల పన్ను అనగా ఈ జీఎస్టీని అతిపెద్ద సంస్కరణగా చెప్పుకోవచ్చు. అంతకు ముందు ఉండే అనేక రకాల పన్నులను సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ, సర్ చార్జీలు, రాష్ట్ర స్థాయిలో వ్యాట్,  వంటివి విలీనం చేసి జీఎస్టీని అమల్లోకి తెచ్చారు. మనం జీఎస్టీకి ముందు కూడా ఈపన్నులన్నింటినీ చెల్లించేవాళ్లం. కానీ రకరకాల పన్నుల వల్ల వాటిని అంత గమనించే వాళ్లం కాదు. ఈ పన్ను శ్లాబులు  కొన్ని వస్తువులకు 0 శాతం, కొన్నింటికి  5శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా ఉన్నాయి.

జీఎస్టీలో 2 రకాలు ఉంటాయి.  సీజీఎస్టీ అంటే జీఎస్టీలో కేంద్రానికి పోయే వాటా. ఎస్‌జీఎస్టీ అంటే జీఎస్టీ లో రాష్ట్రానికి వచ్చే వాటా. దీనిమీద మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మనం ఒక వెయ్యి రూపాయల వస్తువు కొనుగోలు చేసాం అనుకోండి. అది 18శాతం జీఎస్టీ లో ఉండే వస్తువు అని అనుకుంటే ఆ వస్తువు మీద అదనంగా 180 జీఎస్టీ పడుతుంది. ఆ వస్తువు ఖరీదు పన్ను తో కలసి 1180 అవుతుంది.  సీజీఎస్టీ  90 రూపాయలు కేంద్రానికి వెళ్తే, ఎస్‌జీఎస్టీ  90రూపాయలు రాష్ట్రానికి వెళ్తుంది. బిల్లులో చూడడానికి చెరి సగం పంచు కుంటున్నారు అని అనిపిస్తుంది. కానీ వాస్తవం అది కాదు.  ఎందుకంటే కేంద్రం వసూలు చేసే (పెట్రోల్ ఉత్పత్తుల మీద సెస్ తప్ప) అన్ని రకాల పన్నుల్లో మళ్ళీ రాష్ట్రాలకు 42 శాతం ఇవ్వవలసి ఉంటుంది.  ఈ లెక్కన కేంద్రానికి వెళ్లిన వాటా 90 లో మళ్ళీ 42శాతం అంటే సుమారు 38రూపాయలు… తిరిగి కేంద్రం… రాష్ట్రాలకు వెనక్కి ఇచ్చేస్తుంది. అంటే పై ఉదహరణలో మొత్తం  180లో చివరికి కేంద్రానికి   90 నుండి 38 తీసివేస్తే కేంద్రానికి 52 మాత్రమే చేరుతుంది. రాష్ట్రానికి  90కి 38 కలిపితే 128రూపాయలు చేరుతాయి. అంటే ప్రతీ వస్తువుపైన వసూలు చేస్తున్న జీఎస్టీ ప్రతీ రూపాయిలో రాష్ట్రాలకు 71పైసలు వెళ్తే, కేంద్రానికి 29 పైసలు మాత్రం మిగుల్తున్నాయి. కానీ తిట్లు మాత్రం 100 శాతం కేంద్రానికే తగులుతున్నాయి. ఎందుకంటే రోజూ వారి సమాచారం కోసం సామాన్య ప్రజలు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీద ఆధారపడతారు.

ప్రజలకు నిజాలు చెప్పవలసిన మీడియా తమ పార్టీల కొమ్ము కాయడానికి నిజాలని తొక్కి పెట్టి కానీ, వక్రీకరించి గాని రాస్తున్నాయి లేదా టీవీల్లో చెపుతున్నాయి. అదే నిజమని ప్రజలు నమ్ముతున్నారు. కనీసం విద్యావంతులు, దేశస్థితిగతులపై అవగాహన కలిగినవారు నిజాలు తెలుసుకొని, తమకు తెలిసినవారికి కూడా చెప్తే ఈ వదంతులకు చెక్ పడుతుంది.