Home Page SliderTelangana

బాన్స్‌వాడ నుంచి స్పీకర్ పోచారం గెలుస్తారా?

ఊరు పేరును ఇంటిపేరుగా మార్చుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్‌వాడ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నాయకుడనిపించుకోవాలని ఆయన భావిస్తున్నారు. 2018 ఎన్నికల్లో విజయం తర్వాత స్పీకర్ పోస్టుతో సరిపెట్టుకున్న పోచారం, ఈసారి ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి దక్కించుకోవాలని భావిస్తున్నారు. వాస్తవానికి తన కుమారుడికి టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ.. కీలక సమయంలో సీటివ్వడం కరెక్ట్ కాదన్న భావనతో సీఎం కేసీఆర్ మరోసారి పోచారంను రేసులో నిలబెట్టారు. బాన్స్‌వాడలో ఈసారి అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తున్నప్పటికీ విజయంపై పోచారం దీమాగా ఉన్నారు. మొదట్లో బీఆర్ఎస్, ఆ తర్వాత బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏనుగు రవీందర్ రెడ్డి హస్తం పార్టీ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటే.. బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ బాన్స్‌వాడలో బోణీ కొట్టాలనుకుంటున్నారు.

బాన్స్‌వాడ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 258 పోలింగ్ బూత్‌లు ఉండగా పురుష ఓటర్లు 92,225, స్త్రీ ఓటర్లు 1,00,608 ట్రాన్స్‌జెండర్లు 8 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లు 1,92,841 ఉన్నారు. బాన్స్‌వాడ నియోజకవర్గంలో కమ్మ ఓటర్లు కీలక భూమిక పోషిస్తున్నారు. కమ్మ ఓటర్లు ఇక్కడ సుమారుగా 14 శాతం వరకు ఉన్నారు. ఆ తర్వాత లాంబాడ 9 శాతం, ముస్లింలు 9 శాతం, ముదిరాజ్‌లు 9 శాతానికి కొంచెం అటూ ఇటూగా ఉన్నారు. మున్నూరు కాపు, గౌడలు 8 శాతానికి దగ్గరగా ఉన్నారు. మాదిగలు ఏడున్నర శాతం, మాలలు ఆరున్నర శాతం, రెడ్లు 5 శాతం, బెస్తలు 5 శాతం ఉండగా, ఇతరు 18 నుంచి 20 శాతం వరకు ఉన్నారు.